కంగనా రనౌత్‌: లచ్చిందేవికీ ఓ లెక్కుంది

లచ్చిందేవికీ ఓ లెక్కుంది. అంతా స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటేనే లచ్చిందేవి ఎంట్రీ ఇస్తుంది, లేదంటే వెళ్ళిపోతుంది, అటువైపు కూడా చూడదు. ఈ కాన్సెప్ట్‌తో కంగనా రనౌత్‌ లక్ష్మీదేవిగా ఓ షార్ట్‌ ఫిలింని రూపొందించారు. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్‌ కదా. దీంట్లో రవికిషన్‌ (రేసుగుర్రం ఫేం), ఇషా కొప్పికర్‌ (బాలీవుడ్‌ నటి) ఇంకొందరు నటించడం జరిగింది.

ఇంటర్నెట్‌లో విడుదల చేసిన ఈ షార్ట్‌ ఫిలిం అందర్నీ ఆలోచింపజేస్తోంది. కంగనా రనౌత్‌ కూడా నిండుగా లక్ష్మీదేవి పాత్రలో దైవత్వం కలిగి దర్శనమిచ్చింది. చూడగానే కంగనా రనౌత్‌ గెటప్‌కి భక్తిభావంతో నమస్కారం చెయ్యకుండా ఉండలేరు ఎవరైనా. ఇంట్లో శుభ్రత పాటించకపోతే ఫొటోలోని లక్ష్మీదేవి మాయమైపోతుంటుంది. పాన్‌ షాప్‌లో చెత్తను ఇష్టమొచ్చినట్లు పడేస్తుంటే అక్కడా లక్ష్మీదేవి ఫొటోలోంచి గాయబ్‌.

రోడ్డు మీద వెళుతూ రోడ్డుపై చెత్త పారేసే ఓ బడాబాబు కారులోని లక్ష్మీదేవి కూడా అంతే. ఈ కాన్సెప్ట్‌ అందర్నీ ఆలోచింపజేస్తోంది. లక్ష్మీదేవి కావాలంటే ఇల్లంతా, పరిసరాలంతా పరిశుభ్రంగా ఉంచుకోమని చెబుతోంది ఈ షార్ట్‌ ఫిలిం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆలోచనల్లోంచే ఈ స్వచ్ఛ భారత్‌ పుట్టుకొచ్చింది. దానికి అనుగుణంగా రూపొందించిన ఈ స్వచ్ఛ భారత్‌ – లక్ష్మీదేవి షార్ట్‌ ఫిలిం ఎంతో అద్భుతంగా ఉంది. అమితాబ్‌ బచ్చన్‌ చివర్లో ఇచ్చిన మెసేజ్‌ కూడా అద్భుతహ.