చంద్రబాబు వరల్డ్ టూర్:రష్యా వంతొచ్చింది

చంద్రబాబు చైనా పర్యటనకెళ్ళాడు.అక్కడి విశేషాలను ఇక్కడి ఆస్థాన పత్రికలు, మీడియా మొత్తం ఎప్పటికప్పు Flash న్యూస్ రూపం లో యే రోజు ఎన్నెన్ని పెట్టుబడులు బాబుగారు తెచ్చేస్తున్నారో సవివరంగా వండి వార్చేసారు.మొత్తానికి ఓ 58 వేల కోట్ల పెట్టుబడులు చైనా నుండి అమరావతికి తరలి రానున్నాయట.మొన్నామధ్య విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏకంగా 4 లక్షల కోట్లకు పైగానే పెట్టుబడులు రానున్నట్టు ఊదరగొట్టేసారు.అయితే ఇప్పటి వరకు నయా పైసా పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు.మరి ఈ చైనా 58 వేల కోట్ల మాట దేవుడెరుగు.

సంతకాలు చేయడం, ఒప్పందాలు జరగడం వేరు వాటిని కార్యరూపం దాల్చేలా చేయడం వేరు.కేవలం పబ్లిసిటీ యే అజెండాగా చేస్తే జరిగేవి సంతకాలు తప్ప ప్రజాప్రయోజనం కాదు.అయినా ప్రశ్నించాల్సిన, ప్రజా పక్షాన నిలబడాల్సిన మీడియా మూకుమ్మడిగా పాలక పక్షానికి కొమ్ము కాస్తుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది.బాబుగారు అడుగేస్తే ఆహా ఓహో అధికార భజన.ఇదే తంతు.నిజంగా సిగ్గుపడాలి ఈ భజన మీడియా మొత్తం.ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.

ఇక చైనా పెట్టుబడుల వరద నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్రప్రజలకు త్వరలో రష్యన్ సునామి తాకేటట్టుంది.అదేనండి చంద్రబాబు గారు త్వరలో రష్యా వెళ్లి అక్కడి నుండి పెట్టుబడులను మోసుకురాబోతున్నారు.ఈ సారి యే నంబర్ చెప్తారో అని సామాన్యులకి అప్పుడే గుబులు మొదలైంది.అయినా చైనా పర్యట ముగించుకుని సరా సరి ఢిల్లీ లో దిగి జెట్లీ తో సమావేశమై ఒకాయనేమో చైనా పర్యటన అక్కడి పారిశ్రామికీకరణ విశేషాలు వివరించడానికి ఈ మీటింగ్ అంటారు.ఇక్కడి భజన బ్యాచ్ ఏమో ప్రత్యేక ప్యాకేజి ప్రత్యేక హోదా,రాజధాని నిధులు అంటూ బాబు గారు కేంద్రాన్ని కడిగేశారు అంటారు.కనీసం మీలో మీరైనా ఒక సమన్వయంతో ఉంటే కాస్తయినా గందరగోళం తగ్గుతుందని సామాన్యుని వేదన.

ఎలాగూ సామాన్యుడు వాస్తవానికి దూరంగానే బ్రతుకుతున్నాడు.అదేదో ఓ క్లారిటీతో అయినా బ్రతకనివ్వండి.మన బాబుగారు కేంద్రం నుండి ఏకంగా 50 వేలకోట్లు అని ఒకరు కాదు 35 వేలకోట్లు రాజధానికి తెస్తున్నాడని మన దమ్మున్న మీడియా,సీనియర్ మోస్ట్ మీడియా సంస్థలు ముందే లీకులిచ్చేస్తాయి.తీరా బాబు గారు చావు కబురు చల్లగా కేంద్రం 2500 కోట్లే ఇచ్చిందని నిట్టూరుస్తారు.అంటే ఈయన చేయాల్సిందంతా చేస్తున్నారు అంత మొత్తాన్ని తేవడానికి కానీ కేంద్రమే మోకాలడ్డుతోంది అని బాబుకి మన భజన రాయుళ్లు వత్తాసు పలకడం అన్న మాట.అసలు ఇదేంటి,మేమేంటి,మా పరిస్థితేంటి ,మీరు విదిల్చే ఎంగిలిమెతుకులు యే పాటికి సరిపోతాయన్న ప్రశ్న బాబు నోట రాదు గాక రాదు.ఎందుకంటే దాన్ని కవర్ చేయడానికి భజన బ్యాచ్ రెడీ గా ఉంటుంది కదా.