సంపత్‌ నంది ‘రచ్చ’ చేసేస్తాడా? 

యంగ్‌ డైరెక్టర్స్‌లో మంచి విజన్‌ ఉన్న దర్శకుడిగా సంపత్‌ నంది పేరొందాడు. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’ ఈ మూడు చిత్రాలతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. తృటిలో తప్పిపోయిందిగానీ లేదంటే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఛాన్స్‌ మొదట సంపత్‌ నందికే దక్కింది. సంపత్‌ నంది అంటే మినిమమ్‌ గ్యారంటీ డైరెక్టర్‌. సరైన ఛాన్స్‌ కోసం చూస్తున్న ఈ యంగ్‌ డైరెక్టర్‌, గోపీచంద్‌తో సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఇంకో వైపున సంపత్‌ నందితో ఇంకోసారి వర్క్‌ చేసేందుకు ‘రచ్చ’ హీరో రామ్‌చరణ్‌ కూడా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడని సమాచారమ్‌.

‘రచ్చ’ టైమ్‌లోనే మరో సినిమా చేద్దామని సంపత్‌ నందికి రామ్‌చరణ్‌ హామీ ఇచ్చాడట. దాన్ని నిలబెట్టుకునే క్రమంలో తానే నిర్మాతగా మారి, సంపత్‌ నందితో రామ్‌ చరణ్‌ సినిమా చేయొచ్చంటున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘ధృవ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. దసరా బరిలో నిలిచేందుకు ఈ సినిమా సన్నద్ధం అవుతోంది. ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ కాగానే రామ్‌ చరణ్‌ సంపత్‌నందితోనే సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత మిస్‌ కొట్టిన పవన్‌ కళ్యాణ్‌తో కూడా సినిమా చేస్తానని సంపత్‌నంది నమ్మకంగా చెప్తున్నాడు. మరి సంపత్‌కి పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటికి ఛాన్సిస్తాడో చూడాలిక.