మెగా మూవీ లో ఒక్క ఛాన్స్ ప్లీజ్..

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న 150వ సినిమాలో నటించేందుకు టాలీవుడ్‌ నుంచి నటీనటుల పోటీ ఎక్కువైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో చిరంజీవికి అత్యంత సన్నిహితులైన సినీ ప్రముఖులు ఈ సినిమాలో నటించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారట. వీరిలో ఏటీఎం శ్రీకాంత్‌ అందరికన్నా ముందున్నాడు. ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’, ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమాల్లో శ్రీకాంత్‌ ఏటీఎం పాత్రలో అలరించాడు.

అయితే ఈ పాత్రకి ముందుగా రవితేజని అనుకున్నారు. కానీ రవితేజ ఆ పాత్ర పట్ల ఆసక్తి ప్రదర్శించకపోవడంతో, శ్రీకాంత్‌కి ఆ ఛాన్స్‌ దక్కింది. ఈసారి రవితేజ, చిరంజీవితో సినిమాలో నటించే ఛాన్స్‌ని వదులుకోకూడదని అనుకుంటున్నాడట. అక్కడికీ రవితేజ, చిరంజీవితో ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ సినిమాలో ఓ పాటలో కనిపించాడు. ఏదేమైనా చిరంజీవి నటించే కొత్త సినిమాకి స్టార్‌ కాస్టింగ్‌ బీభత్సంగానే ఉండేలా ఉంది. మెగా ఫ్యామిలీకి చెందిన నటీనటులంతా ఇందులో కనిపిస్తారనే టాక్‌ వినవస్తుండగా, చిరంజీవికి అత్యంత సన్నిహితులైనవారూ ఇందులో కన్పిస్తే, తెర నిండిపోవడం కాదు.. ఉప్పొంగిపోతుంది.

కానీ దానికి బలమైన సన్నివేశాలు కావాలి. చూడబోతే చిరంజీవి చేస్తున్నది రీమేక్‌ సినిమా. ‘కత్తి’ని తెలుగులోకి రీమేక్‌ చేస్తున్నారు. కొత్తగా సన్నివేశాల్ని కలిపితే తేడాలొచ్చేస్తాయ్‌. అందుకే పాటల్లోనో, సినిమా ఎండింగ్‌ టైటిల్స్‌లోనో, అదీ కాదంటే సినిమా ప్రారంభంలోనో వీరందరినీ మిక్స్‌ చేయవలసి ఉంటుంది. లెట్స్‌ వెయిట్‌ మెగా మూవీ చుట్టూ వస్తున్న గాసిప్స్‌ ఏమౌతాయో.