బడ్జెట్ లో లోటు దుబార లో గ్రేటు….

హైదరాబాద్‌ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల హడావుడి తరలింపు వలన రూ.వందల కోట్లు దుబారా అవుతుండగా, ఈ దుబారా ఖర్చులోనూ చేతివాటం మెండుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ అద్దెలు, లీజుల వ్యవహారంలో రూ.కోట్లల్లో అక్రమ పద్దతుల్లో కొంత మంది జేబులు నింపుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. కార్యాలయాల అద్దెలు, లీజులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శ కాల్లోనే వాటంగా స్కాం చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. పైసా ఖర్చు లేకుండా కొన్ని లక్షల చదరపు అడుగుల సర్కారీ భవన సముదాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటికి సంబంధించి అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను పక్కనపడేసి మరీ ప్రైవేటు బిల్డింగ్‌లను అద్దెకు తీసుకునేందుకు ఉబలాట పడుతున్నట్లు సమాచారం. ఆఫీసుల తరలింపులో పెద్ద కుంభకోణం దాగి ఉందని ప్రభుత్వ వర్గాలే వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి అమరావతి ప్రాంతానికి కార్యాలయాల తరలింపుపై ఏర్పాటైన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ సుమారు 50-55 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ కావాలని అంచనా వేసింది. సచివాలయం, 33 ప్రభుత్వ విభాగాలు, 70 డైరెక్టరేట్లు, కమిషనరేట్లు (హెచ్‌వోడి), ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్ల హెడ్‌క్వార్టర్స్‌ను ఏర్పాటు చేయాలి. కాగా గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో సెక్రటేరియట్‌ విభాగాలకు నాలుగు లక్షల చదరపు అడుగుల స్పేస్‌ అందుబాటులోకొస్తుందని తేల్చారు. హెచ్‌వోడిలు, ఇతర ఆఫీసుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సర్కారీ భవనాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల స్పేస్‌ అందుబాటులో ఉందని కలెక్టర్లు ఇచ్చిన సమాచారానికనుగుణంగా నిర్ధారించారు. ఇంకా నికరంగా 40 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ కావాలని అంచనా వేశారు. తొలుత వెలగపూడిలోనే హెచ్‌వోడీల కోసం అదనపు అంతస్థులు నిర్మిస్తామన్న సర్కారు చివరి నిమిషంలో మాట మార్చి ప్రైవేటు భవనాలు అద్దెకు తీసుకొనైనా ఈ నెల 27 లోపు అమరావతికి వచ్చి తీరాలని ఆదేశించిన దరిమిల కుంభకోణానికి బీజాలు పడ్డాయి.

ప్రైవేటే ముద్దు…
విజయవాడ, గుంటూరు పరిసరాల్లో కొన్ని లక్షల చదరపు అడుగుల స్పేస్‌ కలిగిన ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి ప్రైవేటు భవనాలను భారీ మొత్తంపై అద్దెకు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జిల్లాకో యూనివర్సిటీ పెట్టడంతో మంగళగిరికి సమీపంలోని నాగార్జున యూనివర్సిటీలో కొన్ని లక్షల చదరపు అడుగుల స్పేస్‌ ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అన్ని మౌలిక సదుపాయాలూ అందులో ఉన్నాయి. నాగార్జున వర్సిటీ భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకోవాలని అధికారులు ప్రతిపాదనలు తయారు చేయగా, ప్రైవేటు వారికి, అందులోనూ ‘తమ’ వారికి భారీగా లాభం చేకూర్చేందుకు ఆ ప్రతిపాదనలను తుంగలో తొక్కినట్లు తెలుస్తోంది. గతంలో తాత్కాలిక రాజధానిని నాగార్జున యూనివర్సిటీలో పెట్టాలని అధికారులు సలహా ఇవ్వగా వాస్తు పేర ముఖ్యమంత్రి చంద్రబాబు విముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. హెచ్‌వోడిలను సైతం వర్సిటీలో పెట్టకపోవడానికి వాస్తుపై సిఎంకు ఉన్న అపార నమ్మకమే కారణమని తెలిసింది.

అంతా గైడ్‌లైన్స్‌లోనే!!!
కార్యాలయాల అద్దెల విషయంలో సర్కారు ఇచ్చిన మార్గదర్శకాల్లోనే కుంభకోణం చేయడానికి ఆస్కారం కల్పించారని ఆరోపణలొస్తున్నాయి. ఒకే చోట కనీసం 20 వేల చదరపు అడుగులకు తక్కువ కాకుండా లీజుకు తీసుకోవాలి. లీజు సమయం మూడేళ్లు ఉండాలి. చదరపు అడుగుకు రూ.20 లోపు అయితే హెచ్‌వోడిలు నేరుగా తమ విచక్షణతో లీజును ఓకే చేసుకోవచ్చు. రూ.20-30 అయతే రోడ్లు, భవనాల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ఓకే చేయాలి. రూ.30 పైన అసలు చెల్లించకూడదు. అయితే ఒకేసారి 40 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ అదీ తక్కువ సమయంలో చూసుకోవాలని కృత్రిమంగా డిమాండ్‌ సృష్టించారు. మామూలుగానే భవనాలు అద్దెకు దొరకని పరిస్థితి ఉండగా కొంత మంది ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు అద్దెలు పెంచే విధంగా చక్రం తిప్పుతున్నారు. పనికిరాని భవనాలనైనా, ఊరికి దూరంగా విసిరేసినట్లు ఉన్నా, అద్దె పెద్దగా లేకపోయినప్పటికీ చదరపు అడుగుకు ప్రభుత్వం పెట్టిన పరిమితిలో గరిష్ట ధర పొందేందుకు పావులు కదుపుతున్నారు. ఆ ప్రాంతంలో చదరపు అడుగు రూ.10-15 ఉన్నా రూ.29 వరకు తీసుకెళుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. మార్కెట్‌ రేటుతో సంబంధం లేకుండా ఎంత ఎక్కువ పిండుకోవాలో అంతా పిండుకుంటున్నారు. సగటున ఒక చదరపు అడుగుకు నెలకు అద్దె రూ.25 వరకు నిర్ణయిస్తున్నారని అధికారులే చెబుతున్నారు. శిధిలావస్థలో ఉన్న పాత భవనాలకు చిన్న రిపేర్లు, రంగులు వేసిన భవనాలకు సైతం కమర్షియల్‌ స్థాయి కంటే అధిక అద్దెలు చెల్లించేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపణలొస్తున్నాయి.