తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు కుట్ర జరుగుతోందా?

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, కరీంనగర్ జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ జువ్వాడ నర్సింగరావులను సీఎం తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటూ భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి వారి చేరికపై ఆనందం వ్యక్తంచేశారు.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మ‌ళ్లీ ఢిల్లీలో కుట్ర‌లు మొద‌ల‌య్యాయి.. రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టించాల‌నే కుట్ర జ‌రుగుతోంది’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు తెలివిగా ఉండాలని ఆయ‌న అన్నారు. ‘తెలంగాణ త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డింది.. మ‌ళ్లీ మ‌న పాల‌న‌ను చేజార్చుకోవద్ద‌’ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో చ‌రిత్ర‌లో ఎవ‌రూ ఊహించ‌ని అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయని కేసీఆర్ అన్నారు.

తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని కూలదోసి.. రాష్ట్రపతి పాలన పెట్టించాలని ఆ రెండు పార్టీలు కుట్రపన్నాయని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తనకు ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారన్నారు. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఆయన తనకు ఫోన్ చేయగా ఇంటికి ఆహ్వానించానని, అక్కడే ఆయన తనకు ఈ విషయం చెప్పారని కేసీఆర్ అన్నారు.

రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్, బీజేపీ.. అన్ని పార్టీలు ఏకమై జేఏసీగా ఏర్పడి పోరాటం చేశామని, అప్పట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు తప్ప ఒక్క టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. రాజీనామాలు చేయకుండా వాళ్లు పారిపోయారని అన్నారు. తమ పార్టీ నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నప్పుడు జానారెడ్డి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. మీకో నీతి మాకో నీతా అంటూ… మీరు చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారమా అని మండిపడ్డారు.