చంద్రులను టెన్షన్ పెడుతున్న జంప్ జిలానీలు

పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమీక్షిస్తున్నాం, పార్టీ మారిన వెంటనే వేటు తప్పదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోన్న ఫిరా యింపుల నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు ఉన్నాయి.అటు ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటూ పోతుండగా, ఇటు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు చెందిన ఎమ్మెల్యే, ఎంపీలను గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు..

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై తమ ఆధిపత్యం చెలాయించడానికో? లేక ఫిరాయింపుల చట్టాన్ని వాస్తవంగానే సమీక్షించేందుకు చర్యలు చేపట్టే యోచిస్తున్నట్లో? తెలియదు కానీ, వెంకయ్య నాయుడు మాటలు, ఈ ఇద్దరు సీఎంలకు మింగుడుపడ దనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలోకి మారడమంటే ప్రజా విశ్వాసాన్ని అవహేళన చేసినట్లే, ఒక నియోజకవర్గంలోని ప్రజలు తమకు నచ్చిన పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసి గెలిపిస్తే…. తీరా ఆ నాయకుడు మరో పార్టీలోకి మారడంతో ఆ నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీలు మారుతోన్న నేతలు…..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నట్లు గాక మరేమిటి.

ఇక పార్టీ మారుతోన్న నేతల వ్యాఖ్యలు గమనిస్తుంటే విచిత్రంగా ఉంటున్నాయి. విద్యావంతులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజల ఆలోచనా విధానాలు మారుతోన్న నేపథ్యంలో చిన్న పిల్లల్లా మాట్లాడటం ఎంత వరకు సమంజసమో? పార్టీలు మారే ఆ నేతలకే తెలియాలి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయితేనే నియోజకర్గం అభివృద్ది చెందుతుందన్న ఈ నేతల వ్యాఖ్యలతో ఏకీభవిస్తే.. అసలు ప్రతిపక్షాల అవసరమే లేదు కదా…! ఎన్నికల అనంతరం అందరూ అధికార పక్షంలో చేరి తీరాల్సిందే…! కదా..! మరి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా.. ఇలాంటి సంఘటనలు చరిత్రలో ఎక్కడా చోటు చేసుకోలేదు. మరి ఆనాటి నుంచి ప్రతిపక్షాలు లేకుండానే పాలన సాగిందా ? అంటే అదీ లేదు. పోనీ… ఫిరాయింపులు కూడా ఉన్నాయా అంటే అవికూడా అంతగా కనిపించలేదు.కొంత మంది ప్రజా ప్రతినిధులు పార్టీ మారాలనుకుంటే వారు ఆయా పార్టీలకు, తమ పదవులకు సైతం రాజీనామాలు సమర్పించిన సంఘటనలున్నాయి. కానీ ఇలా అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నామని వ్యాఖ్యానించడం చూస్తే…. రాజకీయాలంటేనే కంపు కొడుతున్నాయి. సామాన్య ప్రజలు సైతం పార్టీ ఫిరాయింపులపై బహిరం గంగానే విమర్శిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులు ఏ స్థాయి చేరా యంటే ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను మొత్తం గంప గుత్తగా కొనుగోలు చేసే స్థాయికి చేరాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశ్నించే వారులేకుండా చేయాలనుకోవడం దిక్కుమాలిన ఆలోచనే. విచిత్రమేమి టంటే…పార్టీ మారిన నేతలు..తాము ఏ పార్టీ గుర్తు పై గెలిచామో? ఆ పార్టీ సభ్యత్వానికి, తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయక పోగా… టిక్కెట్ ఇచ్చిన పార్టీ అధినేతను విమర్శిస్తూ, ప్రెస్‌మీట్లు పెట్టి… దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ అదే పార్టీ గుర్తుపై గెలువాలని సవాళ్లు విసురుతుండటంతో ప్రజలు నివ్వెర పోతున్నారు. ముందుగా బేరం కుదుర్చుకోవడం… అనంతరం పార్టీలో నాయకత్వ లోపం ఉందని పేర్కొనడం… ఆ తర్వాత ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో ఉండాలో? నిర్ణయించుకుంటామనడం? పక్కా ప్రణాళికతో పార్టీ మారడం వంటివి తెలుగు రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్న తంతు ఇది. ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ అభ్యర్థిగా ఉండాలని గెలిపించడం.. నియోజకవర్గ అత్యధిక ప్రజల నిర్ణయం కాదా? వారి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ… పార్టీ మారడం సమంజసమేనా? ఇలాంటి వారిపై అనర్హత వేటు వేయడం సబబు కాదా? అని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన ప్రకటనతో ప్రజాస్వామ్య పరిరక్షణ కనిపించింది. ఆయా రాష్ట్రాలను బెదిరించడానికా? లేక ఫిరా యింపుల చట్టాన్ని సమీక్షిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. ఒక వేళ వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఈ చట్టాన్ని సవరిస్తే… రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.