చందమామకి మాధురీ దీక్షిత్‌ కొరియోగ్రఫీ

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. బాలీవుడ్‌ మాజీ హీరోయిన్‌ మాధురీ దీక్షిత్‌ కొరియోగ్రాఫర్‌గా మారనుండగా, ఆమె కొరియోగ్రఫీలో డాన్స్‌ చేసే అవకాశం కాజల్‌ అగర్వాల్‌ సొంతం చేసుకుంది. స్వయంగా మాధురీ దీక్షిత్‌ ఈ మాట చెప్పింది. మాధురీ దీక్షిత్‌ అంటే ఇష్టపడనివారెవరుంటారు? తన అందచందాలతో, తన నటనతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది మాధురీ దీక్షిత్‌. ఆమె క్లాసికల్‌ డాన్సర్‌ కూడా. మోడ్రన్‌ డాన్సుల్లోనూ ఎంతో ప్రావీణ్యం మాధురీ దీక్షిత్‌ సొంతం. బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఆమె ఒకానొక సమయంలో పేరొందింది. మాధురీ దీక్షిత్‌ తొలిసారిగా కొరియోగ్రఫీ చేయడం, ఆ పాటలో రణ్‌దీప్‌ హుడాతోపాటు కాజల్‌ అగర్వాల్‌ డాన్స్‌ చేయనుండడం పట్ల బాలీవుడ్‌ మాత్రమే కాదు, ఇండియన్‌ సినీ అభిమానులే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఇది తన జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి అని కాజల్‌ అగర్వాల్‌ అంటోంది. బాలీవుడ్‌ నుంచే వచ్చినా, కాజల్‌ తెలుగులో హీరోయిన్‌గా స్థిరపడింది. అప్పుడప్పుడూ తమిళ సినిమాలు చేస్తూ, చాలా అరుదుగా బాలీవుడ్‌ సినిమాలు కూడా చేస్తున్న అందాల చందమామ, డాన్సుల్లోనూ దిట్టే. మాధురి కొరియోగ్రఫీలో అందాల చందమామ స్టెప్పులెలా ఉంటాయో చూడాలిక.