ఆ సమయంలో చనిపోదామనుకున్నా: సినీ నటి

తెలుగు సినిమాలలో సహాయ నటి పాత్రల్లో ఎక్కువగా కనిపించిన కవిత మీకు గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా కూడా ఆమె సేవలు అందించింది. చివరికి ప్రస్తుతం బీజేపీలో చేరి, ఆ పార్టీలో కొనసాగుతోంది. తన సినిమాల ద్వారా ఎందరినో అలరించిన ఆమె జీవితంలో మాత్రం ఊహించని విషాదాలు వెంటాడాయి. వందల కోట్ల ఆస్తి హరించుకుపోయింది. భర్త, కొడుకు రోజుల వ్యవధిలోనే చనిపోయారు. జీవితంలో ఎంతగానో క్రుంగిపోయిన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమె జీవితానికి సంబంధించిన కీలక విషయాలిలా ఉన్నాయి.

కరోనా అందరి జీవితాల్లో ఊహించని విషాదాన్ని తీసుకొచ్చింది. అయిన వాళ్లు చనిపోతే కనీసం దహన సంస్కారాలు కూడా చేయలేని పరిస్థితిని తెచ్చింది. కడ చూపు నోచుకోకుండానే చాలా మందికి అంత్యక్రియలు జరిగిపోయాయి. ముఖ్యంగా సినీ నటి కవితకు కరోనా చీకట్లు మిగిల్చింది. ఆమె కేవలం చిన్న పల్లెటూరి నుంచి సినీ రంగంలోకి వచ్చింది. సినిమాల్లో బిజీగా ఉండగానే ఆమెకు 20 ఏళ్ల వయసులో పెళ్లి జరిగిపోయింది. ఆమె భర్త కోటీశ్వరుడు. తన భర్త తనను మహారాణిలా చూసుకున్నారని, ఆయనకు 11 దేశాల్లో ఆయిల్ బిజినెస్ ఉందని కవిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అంత ఆస్తి ఉన్నా, తన ఇష్టాలను ఆయన గౌరవించారని గుర్తు చేసుకుంది. తాను తిరిగి సినిమాలలో సహాయ నటి పాత్రలో నటించానని, ఆయన ప్రోత్సాహమే కారణమి వివరించింది. అయితే ఏడేళ్ల క్రితం ఊహించని నష్టం వచ్చింది. దీంతో ఒకేసారి రూ.130 కోట్లు వ్యాపారంలో నష్టపోయారు. అప్పుల నుంచి బయటపడేందుకు ఉన్న ఆస్తులను కూడా అమ్ముకున్నారు.

ఆ తర్వాత కరోనా రావడంతో కొడుకు చనిపోయాడు. ఇది జరిగిన 10 రోజుల్లోపే బాధతో ఆయన భర్త కూడా కన్నుమూశారు. ఇలా ఒకేసారి భర్తను, కొడుకును పోగొట్టుకున్న కవిత విషాదంలో మునిగిపోయారు. దీని నుంచి బయట పడేందుకు త్వరలోనే తిరిగి సినిమాల్లో నటిస్తానని ఆమె చెబుతోంది.