తెలివిగా మాట్లాడిన తారక్

ఏపీలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్వడం ప్రపంచమంతా చూసింది.. దాదాపు రెండు నిమిషాల పాటు ఆయన రోదించారు. ఆ తరువాత ఏడుస్తూనే మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో అప్పుడు పెద్దగా ఎవరికీ అర్థం కాలేదు. భార్యను రాజకీయాల్లోకి లాగుతారా అని బాబు ప్రశ్నించడంతో.. ఓహో అసెంబ్లీలో ఏదో జరిగిందని జనాలు అనుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం ఆ రోజు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక మరుసటి రోజు నందమూరి కుటుంబం మొత్తం మీడియా ముందుకు వచ్చింది. రాజకీయాలు రాజకీయాలే.. కుటుంబం కుటుంబమే.. కుటుంబంలోకి రాజకీయాలు రాకూడదు.. అలాంటిది అన్నగారి కుటుంబం మీద ఏమిటీ ప్రేలాపనలు? అంటూ బాలక్రిష్ణ ఫైరయ్యారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలా ఆ కుటుంబంలో అందరూ మాట్లాడారు. నారా రోహిత్ కూడా పెద్దమ్మకు మద్దతుగా నారావారిపల్లెలో నిరసన తెలిపాడు. వీరందరూ అయిపోయిన తరువాత అందరి కళ్లూ జూనియర్ ఎన్టీఆర్ పై పడ్డాయి. అరె.. తారక్ రాలేదే.. నందమూరి కుటుంబం మొత్తం వచ్చింది కదా అని అనుకునేలోపు ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు.

2009 ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న తారక్ ఇపుడు బయటకు వచ్చాడు. చంద్రబాబు ఫ్యామిలీకి అవమానం జరిగిందని పార్టీ మొత్తం భావిస్తున్న తరుణంలో ఆయన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన ఎవరినీ విమర్శించలేదు.. ఎవరికీ వార్నింగ్ ఇవ్వలేదు..ఆడపడుచులకు గౌరవమిద్దాం అని సూచించారు. తాను నందమూరి కుటుంబ సభ్యుడిగా కాదు.. సగటు వ్యక్తిగా మహిళలను గౌరవించుకుందాం అని పేర్కొన్నారు. తారక్ మాటలతో టీడీపీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. అరె.. ఇంత సౌమ్యంగా చెబితే ఎలా.. అత్తమ్మకు అవమానం జరిగితే ఇలానేనా స్పందించేది అని కూడా కొందరు ప్రశ్నించారు. అయితే.. ఎవరేమనుకున్నా ఈ విషయాన్ని స్మూత్ గా హ్యాండిల్ చేశాడు తారక్. నందమూరి కుటుంబం నుంచి తారక్ ఏమీ మాట్లాడలేదు అని అనుకున్న వారి నోళ్లకు చెక్ చెప్పాడు. అలాగే అక్కడున్న అధికార పార్టీకి కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇదీ పరిపక్వత పొందిన రాజకీయమంటే..