పనిచేశాం… పదవులివ్వండి సార్…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ గెలుపు కూడా ఎలా ఉందంటే… ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంలో 24 మందికి మంత్రి పదవులు దక్కాయి. వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం కొత్త మంత్రులతో కళకళలాడుతోంది. శాఖల కేటాయింపు పూర్తి కావడంతో.. మంత్రులంతా తమకు కేటాయించిన ఛాంబర్‌లలో మార్పులు చేర్పులు చేసుకుని పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు అందరి చూపు నామినేటెడ్ పదవుల మీదే ఉంది. వాస్తవానికి పొత్తుల కారణంగా చాలా మంది సీనియర్ నేతలకు ఈ ఎన్నికల్లో టికెట్లు రాలేదు. అలాగే పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్న నేతలు కూడా పదవులపై ఆశలు పెట్టుకున్నారు.

ప్రస్తుత ఎన్నికల్లో మైలవరం, పిఠాపురం, పాతపట్నం, శ్రీకాకుళం, తిరుపతి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు దేవినేని ఉమా, వర్మ, కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి, సుగుణమ్మలకు టికెట్ దక్కలేదు. వీరిలో వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు బహిరంగంగానే హామీ ఇచ్చారు. మిగిలిన నలుగురికి మాత్రం సముచిత స్థానం ఇస్తామన్నారు చంద్రబాబు. తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగనున్నాయి. సి.రామచంద్రయ్యతో పాటు మహ్మద్ ఇక్బాల్ పై అనర్హత వేటు పడటంతో ఆ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటా ఎన్నికల కావడంతో ఈ రెండు స్థానాలు కూడా టీడీపీ ఖాతాలోకే చేరనున్నాయి. సీ.రామచంద్రయ్య మరోసారి తనకు అవకాశం వస్తుందని ఆశ పడుతున్నారు. జూలై 12న ఎన్నిక కావడంతో.. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలాలంటే ఆగాల్సిందే.

ఇక నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల జాబితా భారీగానే ఉంది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి కోసం పార్టీ డ్వాక్రా, అంగన్వాడీ సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఇదే పదవి కోసం ఇటీవల పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త వీ.ఆర్.లక్ష్మీ శ్యామల కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే సరిగ్గా ఎన్నికల ముందు వీ.ఆర్.లక్ష్మీ శ్యామలను పార్టీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. కాబట్టి ఆచంట సునీతకు లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు పార్టీ నేతలు. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవితో పాటు సభ్యులుగా అవకాశం కోసం కూడా చాలా మంది నేతలు ప్రయత్నం చేస్తున్నారు. బోర్డు ఛైర్మన్‌గా గతంలో పని చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాబట్టి ఆ పదవి ఎవరికి ఇస్తారనే విషయం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారా… లేక సభ్యత్వంతో సరిపెడతారో చూడాల్సి ఉంది. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఆర్టీసీ ఛైర్మన్, పర్యాటక శాఖ, విత్తనాభివృద్ధి… ఇలా కీలక పదవులు భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు పార్టీలో పదవుల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఎమ్మెల్యే అయ్యారు. బీసీ సెల్ అధ్యక్షులు కొల్లు రవీంద్రకు మంత్రి పదవి ఇచ్చారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు హోమ్ మంత్రి పదవి వచ్చింది. ఇలాంటి కీలకమైన పదవుల కోసం కూడా నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులని ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తెగేసి చెప్పారు. పదవుల కేటాయింపు బాధ్యత మొత్తం లోకేష్ చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లోకేష్ నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.