ఈ ఏడాది బంపర్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలు ఇవే ….!

మన దేశంలో ఒక స్టార్ హీరో సినిమా విడుదలకు, ఒక సాధారణ హీరో సినిమా విడుదలకు మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. ఒక సాధారణ హీరో సినిమా విడుదల అయితే, కథ, కధనం బాగుంటేనే ప్రేక్షకులు ఆ సినిమా చూసేందుకు ఇష్టపడతారు. కానీ ఒక స్టార్ హీరో సినిమా విషయంలో ఆలా జరగదు. ఒక స్టార్ హీరో సినిమాకు కథ, కథనంతో సంబంధం లేకుండా, విడుదల మొదటిరోజే సినిమాను చూడడానికి థియేటర్ల వద్ద కాపు కాస్తారు అభిమానులు. ఐతే ఏ స్టార్ హీరో సినిమా ఐనాసరే మంచి కథ లేకపోతే రెండు రోజుల తరువాత ప్రేక్షకులు థియేటర్లకు రారన్న విషయం మనందరికీ బాగా తెలిసినదే. రెండు రోజుల తరువాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే కథ బాగుండి తీరాల్సిందే. అందుకే భారీ బడ్జెట్లతో నిర్మితమయ్యే స్టార్ హీరోల సినిమాలకు మొదటి రెండు రోజులు ఎంతో కీలకం. కొన్ని చిత్రాలు ఒకటి రెండు రోజులలోనే బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ ఏడాది అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించిన సినిమాలేమిటో ఇప్పుడు చూద్దాం.

ఖైదీ సినిమాతో వెలుగులోకి వచ్చి, విక్రమ్ చిత్రంతో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొట్టాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్. విక్రమ్ చిత్రం తరువాత లోకేష్ తెరకెక్కించబోయే చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు అభిమానులు. లోకేష్ విక్రమ్ తరువాత విజయ్ హీరోగా “లియో” చిత్రం తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రం, ఊహించిన విధంగానే, మొదటిరోజు 145 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక మన మాట్లాడుకోవాల్సిన రెండో చిత్రం “ఆదిపురుష్”.

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటిరోజు 135 కోట్ల వసూళ్లు రాబట్టి రెండో స్థానంలో నిలిచింది. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. తరువాత స్థానంలో ఉన్న చిత్రం “జవాన్”. బాలీవుడ్ బాదుషా షా రుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని, మొదటి రోజు 129 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఆ తరువాత స్థానాలలో పఠాన్ 106 కోట్లు, 95 కోట్ల వసూళ్లతో జైలర్, టైగర్ 3, 58 కోట్లతో పొన్నియన్ సెల్వం, 54 కోట్లతో గద్దర్ 2, 50 కోట్లతో వీరసింహారెడ్డి, 49 కోట్లతో వాల్తేర్ వీరయ్య తరువాత స్థానాలలో నిలిచాయి.