ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ భారతీయ సినిమా రంగానికి అందించిన సేవలను గుర్తించింది భారతదేశ ప్రభుత్వం. ఎన్నో దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో, నృత్యంతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన మాధురి దీక్షిత్ ను ఒక ప్రత్యేక గౌరవంతో సత్కరించింది. ప్రస్తుతం గోవా లో జరుగుతున్న “ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా” వేదికగా “స్పెషల్ రెకగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ తో ఇండియన్ సినిమా” పురస్కారంతో సత్కరించారు. ఈ విషయాన్నీ యూనియన్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్ శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. “ఎన్నో దశాబ్దాలపాటు తన విలక్షణ నటనతో సాటి లేని ప్రతిభతో భారతీయ సినిమాకు తన సేవలనందించిన మాధురి దీక్షిత్ గారిని స్పెషల్ రెకగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ తో ఇండియన్ సినిమా అవార్డుతో సత్కరించడం జరిగింది” అని ఆయన ఎక్స్ లో రాసుకొచ్చారు.
1967 వ సంవత్సరంలో మహారాష్ట్ర లోని ముంబై లో జన్మించారు మాధురి దీక్షిత్. అంధేరి లోని డివైన్ చైల్డ్ హై స్కూల్ లో తన ప్రాధిమిక విద్యను పూర్తి చేసుకున్న ఆమె, మైక్రో బయాలజిస్ట్ అవ్వాలనే ఆశతో ముంబై లోని సాధయే కాలేజీ లో చేరింది. కానీ ఆ చదువుని మధ్యలోనే ఆపేసి సినిమాలలో నటించడం ప్రారంభించింది. 9 ఏళ్ళ వయసు నుంచి కథక్ నృత్యం నేర్చుకున్న మాధురి, 17 ఏళ్ళ వయసులోనే “అబోధ్” అనే చిత్రం ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేసారు. మాధురి తన సినీ ప్రయాణంలో సుమారు 70 చిత్రాలలో నటించారు.
ఆమె తన నటనా ప్రావీణ్యానికి గాను ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2008 వ సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు తో సత్కరించింది. ప్రస్తుతం ఆమెకు దక్కిన ఈ గౌరవాన్నికి సంతోషిస్తూ ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నవంబర్ 20 న గోవా లోని శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం లో ప్రారంభమైన ఈ వేడుక, 9 రోజులపాటు కొనసాగుతుంది. విజయ్ సేతుపతి, కారం జోహార్, పంకజ్ త్రిపాఠి వంటి సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.