ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ పోటీ చేస్తారో తెలుసా…?

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి… ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ పరిచయమే. ఇందుకు కీలక కారణాలున్నాయి. వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో రాజధాని అమరావతి పరిధిలో గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అసెంబ్లీలో గుండె జగన్.. జగన్ అని కొట్టుకుంటుంది అంటూ మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇసుక ర్యాంపులు, పేకాట శిబిరాల నుంచి ఎంత ఆదాయం వస్తుంది… మనకెంత ఇస్తారు…. అంటూ మాట్లాడిన ఆడియో కాల్ పెద్ద వైరల్ అయ్యింది. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు అనుకూలంగా ఓటు వేశారనే ఆరోపణలతో వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు శ్రీదేవి. నాటి నుంచి పూర్తిగా నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు. ఇక యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న మాజీ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి టీడీపీకి మద్దతు తెలిపారు. ఇక నాటి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు శ్రీదేవి.

తాడికొండ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేయడం దాదాపు ఖాయం. దీంతో శ్రీదేవి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం ప్రశ్న తలెత్తింది. ముందుగా బాపట్ల పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా శ్రీదేవి పేరు తిరువూరు నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు. ఇక్కడ నుంచి టీడీపీ గెలిచిందే లేదు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున రక్షణనిధి ఎమ్మెల్యేగా గెలిచారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేయడం దాదాపు ఖాయమే. అయితే టీడీపీ తరఫున ఎవరూ అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. ప్రస్తుతం టీడీపీ ఇంఛార్జ్‌గా దేవదత్ వ్యవహరిస్తున్నారు. అయితే దేవదత్‌కు బదులుగా తనకు టికెట్ ఇవ్వాలని ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే తిరువూరు నియోజకవర్గం పరిధిలో ప్రచారం కూడా చేస్తున్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలతో భేటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పార్టీలో ఓ కీలక నేత ద్వారా మంత్రాంగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి సుమారు 24 వేల ఓట్లు ఉన్నాయని… అందులో 14 వేల వరకు తనకు వస్తాయని… కాబట్టి తనకే టికెట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అధినేత కరుణిస్తాడో లేదో చూడాలి.