న్యూజిలాండ్‍లో పెద్ద ప్రమాదం.. మంచు విష్ణుకు తీవ్రగాయాలు.!

ఢీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హీరో మంచు విష్ణు గత కొంతకాలంగా ఒక్క హిట్టు కూడా కొట్టలేక సతమతమవుతున్నాడు. తన అభిమానులకు మంచి హిట్ ఇవ్వాలని విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో పరమేశ్వరుడి పరమ భక్తుడు భక్త కన్నప్పగా విష్ణు కనిపించనున్నాడు. దాంతో అభిమానుల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి.

బాలీవుడ్ డైరెక్టర్, మహాభారతం టీవీ సిరీస్ ఫేమ్ ముకేశ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం న్యూజిలాండ్‍లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే షూటింగ్ సమయంలో ఒక ప్రమాదం జరిగినట్లు, అందులో మంచు విష్ణుకు తీవ్ర గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి.

న్యూజిలాండ్‍లో యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తుండగా మంచు విష్ణుకు దెబ్బ తగిలినట్లు టాక్ నడుస్తోంది. ఒక పెద్ద డ్రోన్ వచ్చి విష్ణు మీద కూలిపోయిందని, సరిగ్గా అది అతడి చేతి మీద కూలిందని అంటున్నారు. అది చాలా ఎత్తు నుంచి కూలిపోవడంతో విష్ణు చేతికి బాగానే దెబ్బలు తగిలాయని కొందరు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరగగానే మూవీ టీం ఉలిక్కిపడిందని సమాచారం. ఆపై వెంటనే షూటింగ్ తాత్కాలికంగా ఆపేసారని తెలుస్తోంది. మంచు విష్ణు కి దెబ్బలు తగిలినట్లు మూవీ టీం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

కానీ ఈ ఘటన గురించి సినీ అనలిస్ట్ రమేశ్ బాల ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. భక్త కన్నప్ప షూటింగ్‍ కోసం న్యూజిలాండ్‍ వెళ్లిన మంచు విష్ణు.. ఓ యాక్షన్ సన్నివేశం తీస్తుండగా గాయపడ్డాడని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసి మంచు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విష్ణు త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థిస్తున్నారు. భక్తకన్నప్ప సినిమాలో ప్రభాస్ కూడా నటిస్తున్నాడు.