ఢీ డ్యాన్స్ షో ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు కొరియోగ్రాఫర్ యష్. బుల్లితెరపై పలు షోల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తన డ్యాన్స్‌తో కోట్లాదిమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న యష్ పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించాడు. ఇక ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్లో రూపొందుతున్న ఆకాశం దాటి వస్తావా సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయం కాబోతున్నాడు. శశి కుమార్ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది.
కార్తీక మురళీధరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ సాంగ్స్ ‘ శృంగార ‘ అనే పాటను శుక్రవారం రిలీజ్ చేశారు. కార్తీక్ స్వరపరిచిన ఈ పాటను సంచిత హెగ్డే, మాళవిక శంకర్ పాడారు. లవర్స్ అందరిలో ఉండే బ్యూటిఫుల్ ఫీలింగ్స్ ను కళ్ళకు కట్టినట్లుగా ఈ పాటలో చూపించారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.
ఇది ఒక మ్యూజిక్ లవ్ స్టోరీ. హార్ట్ ఫుల్ స్టోరీ గా చాలా రియలెస్టిక్ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలే రిలీజ్ అయిన ‘ ఉన్నానో లేనో ‘ అనే సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది అని మూవీ మేకర్స్ వివరించారు. అయితే యష్ హీరోగా పరిచయం కాబోతున్న ఈ సినిమాతో సక్సెస్ అందుకొని నటుడుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడో లేదో వేచి చూడాలి.