ఏఆర్ రెహమాన్ కాన్సెర్ట్ పై ట్రోలింగ్.. స్కామ్ చేశారంటూ సంచలన ఆరోపణలు..

ఆస్కార్ అవార్డు, గ్రహీత దిగ్గజ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఎంతసేపు విన్నా వినాలనిపిస్తుంది. అదే లైవ్‌లో వింటే ఆ అనుభూతి వేరు. చెన్నైలో అతను రీసెంట్‌గా “మరక్కుమా నెంజమ్‌” పేరుతో మ్యూజికల్ కన్సర్ట్‌ కండక్ట్ చేయగా దాన్ని చూసేందుకు ప్రజలు పోటెత్తారు. అయితే ఈ ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీ/మ్యూజికల్ కన్సర్ట్‌కి టిక్కెట్లు కొనుగోలు చేసిన చాలా మంది వ్యక్తులు నిర్వహణ లోపం కారణంగా నిరాశకు గురయ్యారు. వీఐపీల కోసం నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ముందు వరుసలో కూర్చున్న వారికి కూడా రెహమాన్ గొంతు వినిపించలేదు. వేదిక నిండినందున టిక్కెట్లు ఉన్న కొంతమందిని కచేరీలోకి అనుమతించలేదు.

కాగా AR రెహమాన్ అభిమానుల ఫిర్యాదులపై స్పందించారు. ఇబ్బందిపడిన వారు తమ అసలు టిక్కెట్లను తన బృందంతో పంచుకోవాలని కోరారు. డబ్బులు తిరిగి ఇచ్చేలా ఏర్పాటు చేస్తానని కూడా చెప్పారు. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ పూర్ మేనేజ్‌మెంట్ వల్ల అసహనానికి గురైన ఓ ఫ్యాన్ తమ సంగీత కచేరీ టిక్కెట్లను చింపి వేస్తున్నట్లు చూపించే ఓ వీడియోను పేరు చేశాడు. సదరు అభిమాని ఈ ఈవెంట ను జన్మలో మర్చిపోలేనని, AR రెహమాన్ నుంచి ఇదొక “చెత్త బహుమతి” అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ కచేరిలో మ్యూజిక్ విని ఎంజాయ్ చేసేందుకు తమిళనాడు నలుమూలల నుంచి ఆదివారం సాయంత్రం చెన్నైలోని ఆదిత్యరామ్ ప్యాలెస్ సిటీకి 45,000 మందికి పైగా ప్రజలు వచ్చారు, అయితే బారులు తీసిన క్యూలు, ట్రాఫిక్ ఇబ్బందులు, ఈవెంట్ మేనేజర్ల తప్పిదాలు వల్ల చాలామంది లోపలికి వెళ్లలేక పోయారు. టిక్కెట్‌లను కలిగి ఉన్న చాలా మంది అభిమానులు లోపలికి వెళ్లలేక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక పెద్ద స్కామ్ అంటూ ఆరోపణలు చేశారు. కొందరు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో పోలీసులు, నిర్వాహకులతో (ACTC ఈవెంట్స్) వాగ్వాదానికి దిగారు. మొత్తం మీద ఈ ఈవెంట్ ఏఆర్ రెహమాన్ పై తీవ్ర విమర్శలకు కూడా దారి తీసింది.