ఇలా అయితే అనుకున్న లక్ష్యం కష్టమే…!

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం.. అనుకున్న లక్ష్యం చేరడం కష్టంగానే ఉంది. అందుకు ప్రధాన కారణం… అధ్యక్షుని మార్పు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు దూకుడుగా వ్యవహరించిన బీజేపీ నేతలు.. ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిందనే చెప్పాలి. కేవలం ఒకటే అసెంబ్లీని గెలుచుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఖాతాలో నాలుగు ఎంపీ సీట్లు చేరాయి. దీంతో దూకుడు పెంచారు బీజేపీ నేతలు. ఇక బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షునిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టార్గెట్ కేసీఆర్ అన్నట్లుగా సంజయ్ వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే… కేసీఆర్ సర్కార్‌కు ముచ్చెమటలు పట్టించారు బండి.

గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీల పొత్తు కారణంగా మేయర్ పదవికి బీజేపీ దూరమైంది. బీజేపీ ఈ స్థాయిలో విజయం సాధించడానికి కేవలం బండి సంజయ్ మాత్రమే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇక ఈటల రాజేందర్ వంటి కీలక నేతలు బీజేపీ చేరడంలో కీలకంగా వ్యవహరించారు బండి. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా… మునుగోడు ఉప ఎన్నికల్లో దాదాపు గెలిచినంత పని చేసింది. ఒక దశలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

అయితే సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్షుడి మార్పు తెలంగాణ బీజేపీకి బ్రేకులు వేసినట్లైంది. బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ఢిల్లీ పెద్దలు. ఇక బండిని జాతీయ కార్యదర్శిగా నియమించారు. దీంతో బండి మార్పుపై టీ బీజేపీలో విబేధాలు ప్రారంభమయ్యాయి. విజయశాంతి వంటి సీనియర్ నేతలు సైతం ఢిల్లీ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇక కిషన్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకించిన కొందరు నేతలు… పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఇక నిన్నటి వరకు దూకుడుగా వ్యవహరించిన టీ బీజేపీ నేతలు… ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అసలున్నారా లేదా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాత్రమే జరగనున్నాయని విశ్లేషకులు ఇప్పటి నుంచే చెబుతున్నారు.