గుడివాడ కోసం మరో కొత్త పేరు… టీడీపీలో నేతలే లేరా…?

గుడివాడ నియోజకవర్గం… తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నియోజకవర్గం. అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాంటి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. 2004లో టీడీపీ తరఫున తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన నాని… తర్వాత 2009లో కూడా టీడీపీ టికెట్‌పై గెలిచారు. ఆ తర్వాత 2012లో వైసీపీలో చేరారు. ఉప ఎన్నికతో కలిపి ఇప్పటి వరకు వరుసగా 5 సార్లు గెలిచారు నాని. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాని దూకుడుకు పగ్గాలు లేకుండా పోయాయి. టార్గెట్ టీడీపీ, చంద్రబాబు, లోకేశ్ అన్నట్లుగా మాటల తూటాలు వదిలారు. ఒక దశలో నాని భాషపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో నానికి బూతుల మంత్రి అని కూడా టీడీపీ నేతలు పేరు పెట్టారు.

2024లో కూడా గుడివాడ నుంచి వైసీపీ తరఫున నాని పోటీ చేయనున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎవరు అభ్యర్థి అనే విషయం ఇప్పటికీ ఖరారు కాలేదు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిని ఓడించాలనేది టీడీపీ లక్ష్యం. అందుకు అనుగుణంగానే గుడివాడలో భారీ ఎత్తున కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఇప్పటికీ పలు పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. 2019లో ఓడిన దేవినేని అవినాష్ ఆ తర్వాత వైసీపీలో చేరారు. దీంతో నియోజకవర్గం బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు అప్పగించారు చంద్రబాబు. ఆయన కార్యక్రమాలు చేపడుతున్న సమయంలోనే కొత్తగా ఎన్ఆర్ఐ నేత వెనిగళ్ల రామును గుడివాడలో దింపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన రాము భార్య ఎస్సీ. దీంతో ఈ రెండు వర్గాల ఓట్లు తమకే వస్తాయని భావించారు. పైగా ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో… ఖర్చు విషయంలో కూడా వెనుకాడేది లేదని తేల్చేశారు.

అయితే తాజాగా పార్టీ నిర్వహించిన సర్వేల్లో గుడివాడలో టీడీపీ గెలుపు కష్టమే అనే మాట బలంగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా రావి, వెనిగళ్ల మధ్య వర్గ పోరు అని తెలుస్తోంది. దీంతో వీరిద్దరిని కాదని కొత్త వ్యక్తిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గుడివాడ బరిలోకి హీరో నారా రోహిత్ పేరు వినిపిస్తోంది. సినీ గ్లామర్‌తో పాటు నందమూరి కుటుంబ సభ్యుల అండ కూడా రోహిత్‌‌కు కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబుతో రోహిత్ కలిసి సందర్భంలో ఇదే విషయంపై చర్చ జరిగినట్లు సమాచారం. చంద్రబాబు ప్రతిపాదనకు రోహిత్ కూడా అంగీకరించారని… ప్రస్తుతం ఆయన చేతుల్లో కూడా పెద్దగా సినిమాలు లేకపోవడంతో… ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.