ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌హూర్తం పెట్టుకున్న `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`.. ఈసారైనా వ‌స్తారా?

సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి వెండితెర‌పై క‌నిపించి చాలా ఏళ్లు అయిపోతుంది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈ బ్యూటీ చేసిన లేటెస్ట్ మూవీ `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి`. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి, అనుష్క జంట‌గా న‌టించారు.

చాలా రోజుల నుంచి అనుష్క నుంచి రాబోతున్న మూవీ కావ‌డంతో.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ కోసం అనుష్క ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తేనే ఉన్నారు. కానీ, వారికి నిరాశే ఎదుర‌వుతోంది. నిజానికి ఈ సినిమాను మొద‌ట ఏప్రిల్ లో విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత ఆగ‌స్టు 4న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్ర‌క‌టించారు.

రెండు సార్లు వాయిదా ప‌డింది. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టికి రాక‌కు ముచ్చ‌ట‌గా మూడో సారి ముహూర్తం పెట్టారు. కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొంటూ తాజాగా ఓ వీడియోను పంచుకున్నారు. ఇందులో నవీన్ ఉట్టి కొడుతూ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కాగా,సెప్టెంబర్ 7న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, నయనతార కలిసి నటించిన `జవాన్` మూవీ రిలీజ్ కాబోతోంది. మ‌రి ఈసారైనా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టీమ్ వెన‌క‌డుగు వేయ‌కుండా థియేట‌ర్స్ లోకి వ‌స్తారా లేదా అన్న‌ది చూడాలి.