తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. రాయలసీమతో పాటు ఉమ్మడి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకున్నయాత్ర… రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైన ఇప్పటికే 2,400 కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది కూడా. దీంతో ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీ యువనేతకు వినూత్న రీతిలో స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రకరకాలుగా భారీ దండలు తయారు చేసి… జేసీబీల ద్వారా అందరినీ ఆకర్షిస్తున్నారు.
అయితే పెదకూరపాడు నియోజకవర్గంలో మాత్రం… కేవలం ఒక ఫ్లెక్సీతోనే జనసేన పార్టీ నేతలు ఫుల్ పబ్లిసిటీ సాధించేశారు. పెదకూరపాడు నియోజకవర్గం పొడపాడు గ్రామంలో పాదయాత్ర సాగుతున్న సమయంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఓవైపు లోకేశ్, మరోవైపు పవన్ కల్యాణ్ ఫోటోలు ముద్రించారు. ఫ్లెక్సీ పైన తెలుగుదేశం, జనసేన పార్టీల గుర్తులు వేశారు. యువగళం రధసారధి నారా లోకేశ్ అంటూ రాశారు. ఇక ఫ్లెక్సీలో ఎన్టీఆర్, చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఫోటోలు కూడా ముద్రించారు. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వాస్తవానికి రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే చంద్రబాబు – పవన్ కల్యాణ్‌లు మూడు సార్లు భేటీ కూడా అయ్యారు. వీరిద్దరు సీట్ల పంపకంపై చర్చించారనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. అటు పవన్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని… టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమని కూడా ప్రకటించారు. దీంతో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇలా ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఫ్లెక్సీలు వేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.