ఎమ్మిగనూరులో ‘ఫ్యాన్స్’ ఫైట్..సీటు ఎవరికి?

ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే జిల్లాలో కొన్ని సీట్లు టి‌డి‌పికి కంచుకోటలుగా ఉన్నాయి. అలాంటి సీట్లలో ఎమ్మిగనూరు ఒకటి. ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది. 1985, 1989, 1994, 1999, 2014 ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి గెలిచింది. మధ్య మధ్యలో కాంగ్రెస్ గెలిచింది. 2012 ఉపఎన్నిక, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి చెన్నకేశవ రెడ్డి గెలిచారు.

గతంలో ఈయన 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇలా పలుమార్లు సత్తా చాటిన చెన్నకేశవ రెడ్డి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తిగా లేరు. కాస్త వయసు మీద పడటంతో తన తనయుడుని బరిలో దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే తన వారసుడుకు సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చెన్నకేశవ రెడ్డి సైడ్ అవుతుండటంతో వైసీపీలో పలువురు ఆశావాహులు సీటు కోసం పోటీ పడటం మొదలుపెట్టారు. ఇప్పటికే మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎమ్మిగనూరు సీటుపై కన్నేశారు.

2014లో వైసీపీ నుంచి కర్నూలు ఎంపీగా గెలిచిన ఈమె తర్వాత టి‌డి‌పిలోకి వెళ్లారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి తిరిగొచ్చారు. అయినా జగన్ సీటు ఇవ్వలేదు. ఈ సారి సీటు దక్కించుకోవాలని ఆమె చూస్తున్నారు. ఇటు వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రగౌడ్ సైతం సీటు ఆశిస్తున్నారు. అటు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు కూడా ఎమ్మిగనూరు సీటుపై ఫోకస్ పెట్టారు.

ఇలా పలువురు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. దీంతో జగన్ అభ్యర్ధుల ఎంపికపై సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ఎవరికి మద్ధతు ఎక్కువ ఉంటే వారికే సీటు ఇవ్వాలని చూస్తున్నారు. ఆ లెక్కన  తన కుమారుడుకు అనుకూలంగా రాకపోతే తానే పోటీ చేస్తానని చెన్నకేశవ రెడ్డి అంటున్నారు. చూడాలి మరి చివరికి ఎమ్మిగనూరు సీటు ఎవరికి దక్కుతుందో.