బాబు-పవన్..ఏమన్నా అండర్‌స్టాండింగ్..ఒకరి తర్వాత ఒకరు.!

పైకి కనబడకుండా టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్..మంచి అండర్‌స్టాండింగ్ తో పనిచేస్తున్నారు. కలవడానికి ఇప్పటికీ మూడుసార్లు కలిశారు..కానీ పొత్తులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంటే అధికారికంగా పొత్తులు ఫిక్స్ కాలేదు. కాకపోతే అనధికారికంగా బాబు-పవన్ మాత్రం కలిసి పనిచేస్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట జనసేనకు కేటాయించే సీట్లలో టి‌డి‌పికి డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టారు.

అలాగే జగన్ ప్రభుత్వంపై ఇద్దరు నేతలు ఒకే విధంగా విమర్శలు చేస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది..వారీ పర్యటనలు చూస్తుంటే..ఇద్దరు కావాలని ఒకరి తర్వాత ఒకరు షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. అంటే ఒకే సమయంలో ఇద్దరు నేతలు రాష్ట్రంలో పర్యటించడం లేదు. గతంలో చంద్రబాబు పలు రోడ్ షోల్లో పాల్గొన్నారు. అప్పుడు పవన్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే ఏపీకి వచ్చి సభలు పెట్టేవారు.  ఇక జూన్ నుంచి పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టారు.

పవన్ వారాహి యాత్ర జరుగుతున్న సమయంలో బాబు ఎక్కడా బయట కనిపించలేదు. కేవలం ఆయన పార్టీ పరమైన అంశాల్లో బిజీగా ఉన్నారు. నియోజకవర్గ ఇంచార్జ్‌లతో భేటీ అవుతూ వచ్చారు. ఇక పవన్ రెండు విడతల్లో యాత్ర ముగించి బ్రేక్ తీసుకున్నారు. దీంతో బాబు ప్రాజెక్టుల యాత్ర అని మొదలుపెట్టారు. అలాగే రోడ్ షోలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు.

అయితే బాబు ఇప్పుడు బయట తిరుగుతుంటే పవన్ పార్టీ కార్యాలయానికి పరిమితమై..పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక బాబు పర్యటన ఆగష్టు 10తో ముగుస్తుంది. బాబు పర్యటన ముగిసిన వెంటనే పవన్ వారాహి మూడో విడత యాత్ర మొదలుపెడుతున్నారు. విశాఖ నుంచి మూడో విడత యాత్ర ఉంటుంది. అంటే బాబు-పవన్ మంచి అండర్‌స్టాండింగ్ తో ఒకరి తర్వాత ఒకరు బయటకొచ్చి జగన్‌ని టార్గెట్ చేస్తున్నారు.