వేతన సవరణ విషయంలో జగన్ సర్కార్‌కు విద్యుత్ శాఖ ఉద్యోగుల షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భోజన విరామ సమయంంలో నిరసనలు చేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడేది లేదంటున్నారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు వేరు.. విద్యుత్ కార్పొరేషన్ల ఉద్యోగులు వేరు. వీరికి ప్రత్యేక ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వీరికి విద్యుత్ సంస్కరణల వల్ల భారీ ప్రయోజనం కలిగింది. అయితే.. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతంత జీతాలు అవసరమా అన్నట్లుగా ట్రీట్ చేస్తూండటంతో ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఇవ్వాల్సిన పీఆర్సీ, ఇతర ప్రయోజనాలు ఇవ్వడం లేదు. దీంతో వారు ఇప్పటికే ఉద్యమ బాట పట్టారు. ఆగస్టు నెల పదో తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని నోటీసులు కూడా ఇచ్చారు. సమ్మెకు ముందు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సర్కిల్ కార్యాలయాలు, విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు, విద్యుత్తు పంపిణీ సంస్థల కార్యాలయాలు, ఇంధన సంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఉద్యోగులు మధ్యాహ్నం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పదో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళతామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు ఉద్యోగులు.
ఆగస్టు ఒకటిన నిరసన ర్యాలీలు.., 2, 3 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు, 4, 5, 7 తేదీల్లో వర్క్ టూ రూల్ కార్యక్రమం, 8వ తేదీన విజయవాడ విద్యుత్ సౌధలో మహాధర్నా చేపడతామని సమ్మె నోటీసులో తెలిపాయి ఉద్యోగ సంఘాలు. ఇక తొమ్మిదో తేదీన శాఖాపరంగా అందించిన సిమ్‌కార్డులు యాజమాన్యానికి ఇచ్చేసి.. సెల్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు ఉద్యోగులు.
విద్యుత్ సంస్థల ఉద్యోగులు అత్యవసర విధుల నిర్వహణ పరిధిలోకి వస్తారు. వీరు సమ్మెలు చేయకుండా నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. వీరు ఆందోళనలు చేస్తారని అనుకుంటున్నప్పుడల్లా ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటుంది. ఈ సారి కూడా అలాంటిది చేయవచ్చు. కానీ విద్యుత్ ఉద్యోగులు మాత్రం గట్టిగా పోరాడాలని అనుకుంటున్నారు. అందుకే ఈ సారి పోలీసులకు డబుల్ పని ఉంటుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
గతంలో ఉద్యోగ సంఘాల నేతల్ని కేసులు పెట్టి నోరు మూయించడానికి ప్రభుత్వం వద్ద చాలా ఆయుధాలున్నాయి. సూర్యనారాయణ అనే ఉద్యోగ సంఘం నేతపై కేసు పెట్టి ఆయనను పరారీలో ఉండేలా చేశారు. ఆ భయంతో ఇతర ఉద్యోగ సంఘాల నేతలు జగన్ రెడ్డి ఆహా.. ఓహో అని పొగిడేసి బయటపడ్డారు. ఇప్పుడు విద్యుత్ సంఘాల నేతలపై పోలీసులు అదే ప్రయోగం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెప్పిన వారిపై కేసులు పెట్టడమే పోలీసుల పని.. ఆధారాలున్నాయా? లేవా అన్నది తర్వాత సంగతి తర్వాత.. అటువంటి వైసీపీకి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు ఎలా పోరాడుతారన్నదే కీలకం.