ప్రాజెక్టుల బాట పట్టనున్న చంద్రబాబు…!

టీడీపీ అధినేత త్వరలో ప్రాజెక్టుల బాట పడుతున్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో మూలనపడ్డ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. వైసీపీ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించనున్నారు.

సాగు, త్రాగు నీరు అందించే ప్రాజెక్ట్‌లపై జగన్ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మూలన పడిన ప్రాజెక్ట్‌లు, ప్రభుత్వం ఆయా ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరును.. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను చంద్రబాబు ప్రజలకు వివరించారు. మూడు రోజులు ఈ కార్యక్రమం జరిగింది. ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన తీరు ప్రజల వద్దకు బలంగా వెళ్లింది. దీంతో ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. వచ్చే ఆరు నెలల్లో పనులను పరుగులు పెట్టిస్తామని అంబటి రాంబాబు కామెంట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు అధ్వాన్నస్థితిని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు.

ప్రాజెక్ట్‌ల గురించి పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ ద్వారా వివరించిన చంద్రబాబు.. ఇక నేరుగా ప్రాజెక్ట్‌ల వద్దకే వెళ్లి ఆ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్ట్‌ల పట్ల ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో? వివరించాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం, ఆగస్టు 1 నుంచి చంద్రబాబు పర్యటనలు జరగనున్నాయి. రాయలసీమ ప్రాజెక్టులను ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకూ సందర్శించనున్నారు. అక్కడి పరిస్థితులను ప్రజలకు వివరించనున్నారు. అయితే.. కార్యక్రమాన్ని ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ జగన్ మోపిన పన్నుల భారాన్ని ప్రజలకు వివరించారు చంద్రబాబు. ప్రస్తుతం రైతుల పట్ల జగన్ నిర్లక్ష్యాన్ని వివరించనున్నారు.

చంద్రబాబు ఆగస్టు ఒకటిన నందికొట్కూరు నియోజకవర్గంలోని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడ బహిరంగ సభ ఉంటుంది. ఆ తరువాత మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి ఆలూరులో రాత్రికి బస చేస్తారు. రెండున మాల్యాల, అలగనూరు, గోరకల్లు రిజర్వాయర్‌లను సందర్శించి జమ్మలమడుగు వెళతారు. మూడున గండికోట రిజర్వాయర్‌ను సందర్శించి పులివెందుల, తాడిపత్రి మీదుగా అనంతపురం చేరుకుంటారు. నాలుగున ఉరవకొండ నియోజకవర్గంలోని అమిద్యాల వద్ద ఆగిపోయిన బిందుసేద్యం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు. బెళ్లుబుప్ప మీదగా కళ్యాణదుర్గంలోని జీడిపల్లి, బీటీపి కాలువను పరిశీలించి రాప్తాడు నియోజకవర్గంలోని జీడిపల్లి, పేరూరు కాలువ పనులను పరిశీలిస్తారు. తాత్కాలికంగా నిర్ణయించిన ఈ కార్యక్రమంలో చివరినిమిషంలో మార్పులు ఉంటాయని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు.