ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో పోలీసులు మరింత దూకుడు పెంచారు. ఈ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి సుమారు 2 రోజుల పాటు అతనిని విచారించనున్నారు. కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు డైరక్ట్ గా చిక్కాడు. దాంతో అతని ద్వారా సినీ డ్రగ్స్ లింక్స్‌ను ఛేదించనున్నారు పోలీసులు. ఇందులో భాగంగా కేపీని 2 రోజులపాటు పోలీసుల కస్టడీకి తీసుకునేందుకు కోర్ట్ అనుమతి ఇచ్చింది. కాగా కేపీ చౌదరి గోవా నుండి హైదరాబాద్ కు తరచూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.
ఓ క్లబ్ అడ్డాగా హై లైఫ్ పార్టీలు నిర్వహిస్తున్నాడని సదరు దర్యాప్తులో తేటతెల్లం అయింది. ఈ పార్టీలకు సినీ, రాజకీయ ప్రముఖులు అనేకమంది హాజరైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖులతో పాటు, సౌత్ ఆర్టిస్ట్ లతో కేపీకి దగ్గరి సంబంధాలు ఉన్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. కేసులో భాగంగా కేపీ వాడుతున్న 4 మొబైల్స్ ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కస్టడీలో కేపీ ఇచ్చే సమాచారం ఆధారంగా డ్రగ్స్ వాడిన సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేపీ అడ్డంగా పట్టుబడడంతో టాలీవుడ్ సెలబ్రిటీల్లో గుబులు మొదలైంది.
ఇకపోతే టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు టాలీవుడ్‌లో నలుగురు హీరోయిన్స్.. ఇద్దరు నిర్మాతలకు కె.పి.చౌదరితో సంబంధాలున్నట్టు సమాచారం. వారితో పాటు ఆయన కాల్ లిస్టులో ఉన్న వారిలో మరికొందరిని పోలీసులు విచారించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కె.పి.చౌదరి లిస్ట్‌లో ఉన్న నిర్మాతలు, హీరోయిన్స్ ఎవరనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. తమిళంలో రజినీకాంత్ హీరోగా పా రంజింత్ దర్శకత్వంలో రూపొందిన కబాలి సినిమాను తెలుగులో కె.పి.చౌదరి విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఆయన కొంత కాలంగా గోవాలో ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన డ్రగ్స్ ముఠా సైబరాబాద్ పోలీస్ చేతికి చిక్కడంతో కేపీ చౌదరి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న కారణంగా ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.