ప్రొద్దుటూరులో లోకేష్..తమ్ముళ్ళ రచ్చ..సీటు తేలుస్తారా?

ఉమ్మడి కడప జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. కడపలోని జమ్మలమడుగులో పాదయాత్ర ముగించుకుని ప్రొద్దుటూరులో మొదలైంది. అయితే లోకేష్ పాదయాత్ర జరిగే నియోజకవర్గాల్లో టి‌డి‌పికి కాస్త జోష్ వస్తుంది. అలాగే ఎక్కడకక్కడ నియోజకవర్గాల్లో అభ్యర్ధులని సైతం లోకేష్ దాదాపు ఖరారు చేస్తున్నారు. జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పెద్ద పోటీ లేదు.

కానీ ఇప్పుడు ప్రొద్దుటూరులో మాత్రం పోటీ ఎక్కువగానే ఉంది. ఇక్కడ సీనియర్, జూనియర్ నాయకుల మధ్య పోరు నడుస్తుంది. సీనియర్ నేత మల్లెల లింగారెడ్డి, టి‌డి‌పి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిల మధ్య ఎప్పటినుంచో పోరు నడుస్తుంది. ఆ మధ్య జమ్మలమడుగులో పాదయాత్ర జరిగేప్పుడే ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే వీరికి లోకేష్ కూడా సర్దిచెప్పారని తెలుస్తుంది. ఇద్దరు నేతలు ప్రొద్దుటూరు సీటు కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. అక్కడ గెలుపు అవకాశాలు మెరుగుపడటంతో నేతల మధ్య పోటీ ఎక్కువ ఉంది.

అయితే ప్రొద్దుటూరులో టీడీపీకి పెద్ద పట్టు ఏమి లేదు. అసలు అక్కడ మూడు సార్లు మాత్రమే గెలిచింది. 1983, 1985, 2009 ఎన్నికల్లోనే టి‌డి‌పి గెలిచింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గెలుస్తున్నారు. 2014లో టి‌డి‌పి నుంచి వరదరాజులు రెడ్డి పోటీ చేసి ఓడిపోగా, 2019లో లింగారెడ్డి ఓడిపోయారు.

ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. ఇక సీటు తనదే అని ప్రవీణ్ చెబుతున్నారు. అయితే టి‌డి‌పి అధిష్టానం సీటు ఎవరికి ఫిక్స్ చేయలేదని లింగారెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర ప్రొద్దుటూరుకు చేరుకుంది. దీంతో ఇద్దరు నేతలు పోటాపోటిగా పాదయాత్ర సక్సెస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ప్రొద్దుటూరు సీటు చివరికి ఎవరికి ఇస్తారో చూడాలి.