పంచెకట్టులో ద‌ర్శ‌న‌మిచ్చిన ప్ర‌భాస్‌.. వైర‌ల్ గా మారిన క్రేజీ లుక్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా పంచెకట్టులో దర్శనమిచ్చాడు. ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన‌ ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌, సన్నీ సింగ్‌ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు.

జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా నేడు తిరుపతిలో తార‌క‌రామ స్టేడియ‌మ్‌లో ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ఇక నిన్న రాత్రే తిరుపతికి చేరుకున్న ప్రభాస్.. ఈరోజు ఉదయం చిత్ర టీమ్ తో క‌లిసి శ్రీవారిని దర్శించుకున్నాడు.

పంచెకట్టు, పట్టు వస్త్రాల్లో ప్ర‌భాస్ మెరిసిపోయాడు. సుప్రభాత సేవలో పాల్గొన్న ప్ర‌భాస్‌ స్వామి వారి ఆశీస్సులు పొందారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ మ‌రియు చిత్ర టీమ్ కు ఆలయ పూజారులు, అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థ ప్ర‌సాదాలు అందించారు. ఇక పంచెకట్టులో ప్ర‌భాస్ క్రేజీ లుక్ మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.