హీట్ పుట్టిస్తున్న బాలయ్య టీజర్.. ఏపీ సీఎం జగన్‌పై సెటైర్లు?

బాలయ్య స్క్రీన్‌పై కనిపించగానే ఇక తెలుగు నాట థియేటర్లు ప్రేక్షకుల ఈలలతో దద్దరిల్లిపోతుంటాయి. తెరపై ఆయన పలికే డైలాగులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ముఖ్యంగా మాస్ డైలాగ్‌లు చెప్పడంలో బాలయ్యను మించిన హీరో లేడని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటుంటారు. సినిమా ఏదైనా బాలయ్య డైలాగులకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన హీరోగానే కాకుండా ఏపీలోని హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. త్వరలో ఎన్నికలు కూడా వస్తుండడంతో రెండు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు. ఇక రాజకీయ నేతగానే కాకుండా సినిమాల పరంగా స్టార్ అయిన బాలయ్య రంగంలోకి దూకారు. తన సినిమాల ద్వారా నేరుగా ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా డైలాగులు పలికారు. కొత్త సినిమాలో డైలాగులు రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా రూపొందుతోంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో బాలయ్య పలికిన డైలాగులకు అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. అందులోనూ ప్రస్తుత రాజకీయాలను టచ్ చేసేలా ఆ డైలాగులు ఉన్నాయి. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశిస్తూ ఆ డైలాగులు ఉన్నాయని టీడీపీ అభిమానులు, నందమూరి అభిమానులు పేర్కొంటున్నారు.


వాటిలో ‘రాజు ఆడి వెనుక ఉన్న వందల మందిని చూయిస్తడు. మొండోడు ఆడికి ఉన్న ఒకే ఒక గుండెను చూయిస్తడు.. అడవి బిడ్డ నెలకొండ భగవంత్ కేసరి’ అని చెప్పిన డైలాగ్ బాగా పేరొందింది. ఏపీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ వారిపై మూకుమ్ముడిగా వారు మాటల దాడి చేస్తున్నారు. దానిని ఉద్దేశించి ఈ డైలాగ్ రాశారనే చర్చ సాగుతోంది.