ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం..జూనియర్‌కు ఆహ్వానం..కారుకు ప్లస్.!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పోటాపోటిగా జరుగుతున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. ఇక ఈ ఉత్సవాల్లో నందమూరి కుటుంబం సైతం భాగమవుతుంది. ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ గా వచ్చారు. చంద్రబాబు, బాలయ్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. నందమూరి ఫ్యామిలీ కూడా వచ్చింది.

ఇక నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్‌ని పిలవకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఓపెనింగ్ జరగనుంది. ఖమ్మం నగరాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చుతున్న క్రమంలో లకారం ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. దాదాపు 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు జరుగుతున్నాయి.  మే 28న ఆవిష్కరణకు సిద్ధమవుతోంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని నిర్ణయించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ ఏర్పాటు చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ని పిలవడంతో ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడంతో జిల్లాలో ఉండే ఓ కీలక వర్గం, నందమూరి అభిమానులు బీఆర్ఎస్ పార్టీకి మద్ధతుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది రాజకీయంగా కూడా కలిసొచ్చే ఛాన్స్ ఉంది.

Share post:

Latest