రామబాణం ప్రివ్యూ: గోపీచంద్ సినిమాకు టైటిల్ సూచించింది ఆ హీరోనే

టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. విలన్‌గా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత హీరోగా నిలదొక్కుకున్నారు. వరుస హిట్‌లతో దూసుకుపోయిన ఆయన కెరీర్ ప్రస్తుతం డౌన్ అవుతోంది. వరుస పరాజయాలు ఆయన చవి చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నటించిన రామబాణం శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించారు. గతంలో శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్‌కు రెండు హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు విజయాన్ని దక్కించుకున్నారు.

దీంతో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా వీరి సినిమా రామబాణం మే 5న విడుదల కానుంది. హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. డింపుల్ హయాతి గోపీచంద్‌కి జోడీగా నటిస్తుండగా జగపతి బాబు, ఖుష్బు కీలక పాత్రలు పోషించారు. సచిన్ ఖేడేకర్, నాసర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య అక్కల, గెటప్ శ్రీను, సమీర్ మరియు తరుణ్ అరోరా వంటి బలమైన సహాయక తారాగణం ఉన్నారు.

ఈ సినిమాకు భూపతి రాజా కథ అందించగా, మధుసూదన్ పడమటి డైలాగ్స్ రాశారు. వెట్రి పళనిసామి సినిమాటోగ్రాఫర్ కాగా, పర్విన్ పూడి ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. గోపీచంద్ సినిమాలకు మునుపెన్నడూ లేని విధంగా దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ సినిమాకు రామ బాణం అనే టైటిల్ ను నందమూరి నటసింహం బాలయ్య సూచించారు. ట్రైలర్, టీజర్ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి పలు రూమర్లు కూడా వచ్చాయి. హీరో, దర్శకుడికి విభేదాలున్నాయని, అందుకే ఇది ఆలస్యం అయిందనే వాదన ఉంది. అయితే సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు ఈ సినిమా పట్ల హైప్ పెంచాయి. పైగా గోపీచంద్‌కు ఇది 30వ సినిమా. ఇది గోపిచంద్‌కు మరో హిట్‌గా నిలుస్తుందనే అంచనాలున్నాయి. సినిమా ఫలితం మరి కొన్ని గంటల్లోనే తేలనుంది.

Share post:

Latest