హైకోర్టులో హీరో విశాల్‌కు చుక్కెదురు.. ఆ విషయంలోనే?

కోలీవుడ్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు ఎదురయింది. ఒక కేసు విషయమై రూ.15 లక్షలు చెల్లించకుండా తప్పించుకోవాలని ఈ పందెం హీరో అనుకున్నాడు కానీ మద్రాస్ హైకోర్టు ఆ మొత్తం రిజిస్ట్రార్ పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సిందేనని తీర్పు వెలువరించింది. దాంతో విశాల్ కి మరో మూడు వారాల్లోగా రూ.15 లక్షలు చెల్లించక తప్పడం లేదు. మరి అసలు ఏం జరిగింది? ఈ సినిమా హీరో 15 లక్షలు ఏ విషయమై కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

షార్ట్‌గా విశాల్ అని పిలుచుకునే కోలీవుడ్ హీరో విశాల్ కృష్ణ రెడ్డి 2013లో ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ నిర్మాణ సంస్థ కోసం గతంలో ఫైనాన్సియర్ అన్బుచెళియన్ వద్ద రూ.21.29 కోట్లను అప్పుగా తీసుకున్నాడు. మళ్లీ ఆ అప్పును తీర్చలేకపోయాడు. చివరికి ఏ ఆప్షన్ లేక లైకా ప్రొడక్షన్‌ను ఆశ్రయించాడు. తన అప్పు తీర్చాలని, అలా చేస్తే.. మళ్లీ తాను ఆ అప్పును కట్టేంతవరకు తన సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇస్తానని వారికి మాటిచ్చాడు. ఈ డీల్ కి లైకా ఒప్పుకుంది. ఆపై విశాల్ అప్పులను తీర్చేసింది.

అప్పటినుంచి ఒప్పందం ప్రకారం విశాల్ తన సినిమాల హక్కులను లైకాకే అప్పజెప్తున్నాడు. కానీ 2022లో తన ‘వీరమే వాగై సూడుం (Veeramae Vaagai Soodum)’ సినిమాను సొంతంగా విడుదల చేసుకున్నాడు. నిజానికి ఈ సినిమా 30 కోట్లు పెట్టి తీస్తే సగం డబ్బులు కూడా వసూలు చేయలేకపోయింది. మరోవైపు ఈ మూవీ హక్కులను తమకు ఇవ్వకుండా సొంతంగా రిలీజ్ చేసుకున్నారని విశాల్‌పై లైకా సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం కోర్టు మెట్లు ఎక్కింది. ఈ కేసును టేక్ అప్ చేసిన సింగిల్ జడ్జి సెషన్స్ కోర్టు రిజిస్ట్రార్ పేరిట రూ. 15 కోట్లను 3 వారాల్లో ఎఫ్‌డీ చేయాలని ఆదేశించింది.

దీంతో విశాల్‌కి షాక్‌ తగిలినట్లు అయింది. ఆ తర్వాత అతడు హైకోర్టులో ఆ తీర్పుకి వ్యతిరేకంగా అప్పీల్ చేశాడు. అయితే అక్కడ తనకు అనుకూలంగా తీర్పు వస్తుందేమో అని ఆశ పడ్డాడు. అయితే అక్కడ కూడా నిరాశే ఎదురయింది. మద్రాసు ధర్మాసనం సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ రూ. 15 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా స్పెషల్ జడ్జి తుది తీర్పును ఇచ్చే వరకు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే సినిమాలను థియేటర్ లేదా ఓటీటీలో రిలీజ్ చేయకుండా ఉత్తర్వులు జారీ చేసింది.