ఉత్తరాంధ్రతో పాటు తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాలు టిడిపికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా, వైసీపీకి షాక్ ఇచ్చాయి. ఇప్పటికే విశాఖ రాజధానితో ఉత్తరాంధ్రలో తమకు తిరుగులేదని వైసీపీ భావించింది..కానీ అక్కడ షాక్ తగిలింది. ఇటు తమకు రాయలసీమ కంచుకోట..ఆ రెండు చోట్ల కూడా ఎదురు ఉండదని అనుకుంది.
కానీ పట్టభద్రులు వైసీపీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చేశారు. అయితే ఉత్తరాంధ్రలో టిడిపి చాలా బలంగా ఉంది కాబట్టి అది వదిలేస్తే..సీమలో వైసీపీ బలంగా ఉన్నా సరే గెలవలేకపోవడంపై వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అసలు వీటిల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు ఉన్నాయి..అయినా సరే ఎందుకు ఓడిపోయామనే ఆందోళన వైసీపీలో ఉంది. తూర్పు రాయలసీమ చూసుకుంటే..ఈ పరిధిలో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ప్రకాశంలో 12 సీట్లకు 8, చిత్తూరులో 14 సీట్లకు 13 సీట్లు..నెల్లూరులో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది.
అలాంటి జిల్లాల్లో కూడా వైసీపీ భారీ మెజారిటీ తేడాతో టిడిపి చేతిలో ఓడిపోయింది. ఇక ఇదే ఊపు కొనసాగితే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ మూడు జిల్లాల్లో షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని వైసీపీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇక ఈ మూడు జిల్లాల కంటే పశ్చిమ రాయలసీమ పరిధిలో ఉన్న కడప-కర్నూలు-అనంతపురం జిల్లాల్లో వైసీపీకి పట్టు ఎక్కువ ఉంది.
గత ఎన్నికల్లో కడప, కర్నూలుల్లో స్వీప్ చేసింది..అనంతలో 14కి 12 సీట్లు గెలుచుకుంది. అయితే పట్టభద్రుల్లో అనంతలో టిడిపికి మెజారిటీ వచ్చిన కడప, కర్నూలులో తమకు భారీ మెజారిటీ వచ్చి గెలిచేస్తామని వైసీపీ శ్రేణులు భావించాయి. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది..దీని బట్టి చూస్తే స్వీప్ జిల్లాల్లో కూడా వైసీపీ పట్టు తప్పుతుందని తెలుస్తుంది.