నెల్లూరు పాలిటిక్స్: రూరల్ డ్యామేజ్ కంట్రోల్?

కంచుకోటలాంటి నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకున్న వైసీపీకి ఇప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండగా, ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి వైసీపీ నుంచి బయటకొచ్చారు. ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరం జరిగారు.

ఇలా ఊహించని పరిణామాలతో నెల్లూరు వైసీపీకి డ్యామేజ్ జరుగుతుంది. ఈ డ్యామేజ్‌ని కంట్రోల్ చేయడానికి వైసీపీ అధిష్టానం ప్రయటానిస్తుంది. ఇప్పటికే ఆనం ప్రాతినిధ్యం వహించే వెంకటగిరి స్థానానికి ఇంచార్జ్‌గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఇక కోటంరెడ్డి ప్రాతినిధ్యం వహించే నెల్లూరు రూరల్‌కు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇంచార్జ్‌గా పెట్టారు. తాజాగా ఆయన నెల్లూరు రూరల్‌కు రాగా, వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

రెండు నియోజకవర్గాల్లో వైసీపీ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేసింది. అయితే కోటంరెడ్డి, ఆనం లాంటి సీనియర్లు వైసీపీని వీడటం కాస్త ఇబ్బందికర పరిణామం అని చెప్పవచ్చు. జిల్లాల్లో వీరికి కాస్త ఫాలోయింగ్ ఉంది. అదే సమయంలో వీరు గాని టీడీపీ వైపుకు వెళితే..ఆ పార్టీకి కాస్త అడ్వాంటేజ్‌గా మారే ఛాన్స్ ఉంది. అదే సమయంలో జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టి‌డి‌పికి కలిసొస్తుంది.

ఇప్పటికే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. అక్కడ టీడీపీకి ప్లస్ కనిపిస్తుంది. అటు కావలి, ఉదయగిరి స్థానాల్లో కూడా వైసీపీకి నెగిటివ్ కనిపిస్తోంది. అదేవిధంగా కోవూరు, ఆత్మకూరు స్థానాల్లో వైసీపీకి అనుకున్నంత బలం కనిపించడం లేదు. మొత్తానికి నెల్లూరులో వైసీపీకి కాస్త డ్యామేజ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.