ఏపీ సీఎం జగన్ మరోసారి బీసీ జపం చేశారు. మంత్రివర్గంలోనూ.. తర్వాత.. స్థానిక సంస్థల్లోనూ.. ఆయన బీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారు. మంత్రివర్గంలో మహిళలకు కూడా స్థానం ఇచ్చారు.ఇక, జనరల్ స్థానాల్లోనూ.. బీసీలకు అవకాశం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు బీసీలకు అవకాశం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి జగన్ బీసీ జపం చేశారు.
త్వరలోనే జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. బీసీలకు ఎక్కువగా సీట్లు కేటాయించారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు అంటే.. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాల కింద అభ్యర్థులను తాజాగా ప్రకటించా రు. వీరిలో 11 మంది బీసీలు, 2 ఎస్సీ, 1 ఎస్టీ, 4 ఓసీలకు అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ఇప్పటి వరకు 26 మంది ఉంటే.. వీరిలో 8 మంది బీసీలు ఉన్నారు. ఇక, ఇప్పుడు మరో 11 మందికి అవకాశం ఇచ్చారు.
దీంతో మండలిలో బీసీల సంఖ్య.. 19కి పెరగనుంది. అసలు మండలి చరిత్రలో ఇంత మంది బీసీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించడం అంటే మామూలు విషయం కాదు. మొత్తం 40 సీట్లలో 19 అంటే దాదాపు 50 శాతం ఏకంగా బీసీ నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశాలు వచ్చాయి. అందులోనూ మహిళలకు కూడా మంచి ఛాన్సులు ఇచ్చారు. పోతులు సునీత, అనంతపురం నుంచి మంగమ్మ, కాకినాడ నుంచి కర్రి పద్మశ్రీ లాంటి బీసీ నేతలకు తాజా జాబితాలోనూ చోటు దక్కింది.
అదే సమయంలో జూలై తర్వాత.. మొత్తం పార్టీ తరఫు న 19 మంది బీసీలు, 6 ఎస్సీలు, 1 ఎస్టీ, 4 మైనారిటీలు, 14 మంది ఓసీలు.. ఉండనున్నారు. అంటే.. మొత్తంగా ఎన్నికలకు ముందు బీసీ వర్గాన్ని తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలను జగన్ ముమ్మరం చేశారని అంటున్నారు పరిశీలకులు. కనీసం తమది బీసీల పార్టీ అని చెప్పుకునే ఛాన్స్ లేకుండా జగన్ చేసేశాడనే అంటున్నారు. మరి దీనికి ధీటుగా టీడీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుందో చూడాలి.