ముందస్తు ఫిక్స్ చేసిన టీడీపీ..జగన్‌కు ఆప్షన్ లేదా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణ, ఇటు ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే తెలంగాణలో గతంలో ముందస్తు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ ముందస్తుకు వెళ్ళి గెలిచి మళ్ళీ అధికారం దక్కించుకున్నారు. ఈ సారి కూడా ఆయన ముందస్తుకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది.

తెలంగాణ విషయం పక్కన పెడితే..ఏపీలో ఈ సారి ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని ప్రతిపక్ష టి‌డి‌పి అంటుంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని, పూర్తిగా వ్యతిరేకత పెరగక ముందే జగన్ ముందస్తుకు వెళ్లాలని చూస్తున్నారని టి‌డి‌పి నేతలు అంటున్నారు. తాజాగా పాదయాత్రలో ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఖాయంగా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కేసుల నుంచి కాసుల దాకా అనేక సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారని, అవి తనను ముంచేయక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆయన నిర్ణయుంచుకున్నారని చెప్పుకొచ్చారు.

తాజాగా అమరావతిలో టి‌డి‌పి వ్యూహకమిటీ..చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తాము కూడా ముందస్తు ఎన్నికలకు ఈ రోజు నుంచే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నామని, రేపు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు ఖాయమని, జగన్‌ రెడ్డి మాదిరిగా 175 సీట్లు వస్తాయని అతిశయోక్తులు చెప్పుకోవడం మాకు అలవాటు లేదని చెప్పుకొచ్చారు.

మొత్తానికి ముందస్తు ఎన్నికలు వస్తాయని టి‌డి‌పి భావిస్తుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రసక్తి లేదని అంటున్నారు. చూడాలి మరి చివరికి ముందస్తు ఎన్నికలు జరుగుతాయో లేదో.

Share post:

Latest