ఇద్దరు బడా స్టార్లను నమ్ముకున్న పూజ హెగ్డే… ఈసారి గురి తప్పదా?

పూజ హెగ్డే… తెలుగువాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు. ఈమె మొదట మోడల్ కెరీర్ ప్రారంభించి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో ఈమె 2వ స్థానంలో నిలిచి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆ తరువాతే ఆమెని సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా 2012లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత ఆమె తిరిగి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

తెలుగులో అయితే ఈమె 2014లో ‘ముకుంద’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తరువాత 2016లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో సినిమాలో నటించి బాలీవుడ్లో తన ఉనికిని చాటుకుంది. పూజ తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డేలది కర్ణాటకలోని మంగుళూరు అయినప్పటికీ ఆమె ముంబై లో పుట్టి పెరిగింది. ఆమె తన మాతృ భాషయైన తుళుతో పాటు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఇక అసలు విషయానికి వస్తే బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుత సినిమా కెరియర్ అత్యంత దారుణంగా ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే.

ఇటువంటి తరుణంలో కూడా ఆమె ముందు రెండు బడా ప్రాజెక్ట్స్ నిలిచాయి. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అయితే… ఇక రెండవది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజ హెగ్డే గత చిత్రాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరచగా ఆమె చేస్తున్న ప్రస్తుత ఈ సినిమాలు మాత్రం ఆమెని మరలా గోల్డెన్ లెగ్ గా మారుస్తాయనే ధీమా వ్యక్తం చేస్తోంది.