టీడీపీ-జనసేన పొత్తులో పాత లెక్కలు..కొత్త సీట్లు!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా ఇంకా పొత్తుపై ప్రకటన రాలేదు గాని అటు చంద్రబాబు, ఇటు పవన్ సైతం పొత్తుకు రెడీగానే ఉన్నారని తెలుస్తోంది. వీరితో బీజేపీ కలిసొస్తే ఓకే లేదంటే..టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని సమాచారం. ఇప్పటికే ఈ పొత్తుకు సంబంధించి సీట్లు పంచాయితీ కూడా నడుస్తున్న విషయం తెలిసిందే.

జనసేన ఏమో 40 సీట్లు అడుగుతుందని, టీడీపీ ఏమో 25-30 సీట్లు ఇస్తానని అంటుందని చెప్పి ఎప్పటినుంచో కథనాలు వస్తున్నాయి. కానీ ఇందులో వాస్తవం ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. అయితే పొత్తు ఉంటే కొన్ని సీట్లు జనసేనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంశం మాత్రం బయటకు వస్తుంది. దాదాపు ఆ సీట్లు జనసేనకు ఇవ్వడం ఫిక్స్ అని టీడీపీ అంతర్గత వర్గాల నుంచి సమాచారం వస్తుంది. పొత్తులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు గాజువాక, భీమిలి, చోడవరం, విశాఖ నార్త్, ఎలమంచిలి సీట్లు దక్కుతాయని అంటున్నారు.

అటు తూర్పు గోదావరిలో..రాజోలు, అమలాపురం, కాకినాడ రూరల్ లేదా సిటీ, రాజానగరం సీట్లు దక్కుతాయని ప్రచారం ఉంది. కాకపోతే ఈ జిల్లాలో జనసేనకు బలం ఎక్కువ ఉంది కాబట్టి 8-9 సీట్లు దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో..నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం..ఇంకా రెండు సీట్లు దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

కృష్ణాలో..విజయవాడ వెస్ట్, కైకలూరు, అవనిగడ్డ సీట్లు..గుంటూరులో తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు ఈస్ట్ లేదా వెస్ట్ సీట్లు దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రకాశంలో..గిద్దలూరు, దర్శి, చీరాల, చిత్తూరులో..తిరుపతి, చిత్తూరు సీట్లు దక్కుతాయని ప్రచారం ఉంది. మరి చివరికి పొత్తులో జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయో చూడాలి.