టీటీడీపీ దూకుడు..సీట్లు పంపకాలు షురూ.!

తెలంగాణలో ఎప్పుడైతే టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడుగా వచ్చారో…అప్పటినుంచి రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు యాక్టివ్ అయ్యాయి. ఇక ఖమ్మంలో చంద్రబాబు సభ తర్వాత మరింత దూకుడుగా ముందుకెళుతున్నాయి. ఇక ప్రతి జిల్లాలోనూ భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో నిజామాబాద్ లో సభకు ప్లాన్ చేస్తున్నారు..దీనికి మళ్ళీ చంద్రబాబుని తీసుకురావాలని ట్రై చేస్తున్నట్లు తెలిసింది.

ఇక గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కాసాని వరుస పెట్టి నేతలతో సమావేశమవుతూ ఎక్కడకక్కడ పార్టీకి ఊపు తెచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక మొదట అనుబంధ విభాగాలని బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు యువత, తెలుగు మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్‌లు, తెలుగు రైతు, గీత, చేనేత, టి‌ఎన్‌ఎస్‌ఎఫ్ ఇలా ప్రతి కమిటీని బలోపేతం చేయాలని చూస్తున్నారు.

అటు గ్రామ స్థాయి కమిటీలని సైతం బలోపేతం చేసే దిశగా ముందుకెళుతున్నారు. అయితే తెలంగాణలో టీడీపీకి కొద్దో గొప్పో క్యాడర్  ఉంది. ఇక ఇప్పుడు వారు యాక్టివ్ అవ్వడం వల్ల టీడీపీకి కాస్త ఊపు పెరిగింది. అలా అని టీడీపీకి ఒకటి, రెండు ఎమ్మెల్యేల సీట్లు గెలిచే బలం లేదని చెప్పాలి. కానీ కొన్ని సీట్లలో గెలుపోటములని మాత్రం ప్రభావితం చేయగలదు. అది కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగేలా టీడీపీ ముందుకెళ్లెలా ఉంది. ఎందుకంటే టీడీపీ యాక్టివ్ గా లేకపోవడం వల్ల మెజారిటీ టీడీపీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నారు. ఇప్పుడు టీడీపీ యాక్టివ్ అవ్వడం వల్ల మళ్ళీ వారు ఇటు వచ్చేసే ఛాన్స్ ఉంది. దీంతో పరోక్షంగా కారు పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉంది.

ఇక ఇప్పటికే 119 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని కాసాని చెప్పుకొచ్చారు. తాజాగా కూడా నాయీ బ్రాహ్మణ వర్గానికి మొదట సీటు ఇస్తామని ప్రకటించారు. మొత్తానికి తెలంగాణలో తెలుగుదేశం కాస్త దూకుడుగానే ఉంది.