పుంగనూరు పాలిటిక్స్..పెద్దిరెడ్డిపై పోటీకి మరోనేత!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య దశబ్ద్లాల కాలం నుంచి రాజకీయ వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ వైరం ఇప్పుడు మరింత ఎక్కువైంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి మరింతగా చిత్తూరుపై ఫోకస్ చేసి టీడీపీని దెబ్బతీసేలా ముందుకెళుతున్నారు. అటు చంద్రబాబు కంచుకోట కుప్పంపై కూడా ఎలా ఫోకస్ చేశారో చెప్పాల్సిన పని లేదు. అక్కడ రాజకీయంగా బాబుని దెబ్బతీయాలని చూస్తున్నారు.

దీంతో చంద్రబాబు కూడా రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. ఓ వైపు కుప్పంతో పాటు చిత్తూరు జిల్లాలో పార్టీ బలాన్ని పెంచుతూనే..పెద్దిరెడ్డి కంచుకోట పుంగనూరుపై ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఎలాగైనా పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలని బాబు చూస్తున్నారు. ఇదే క్రమంలో చల్లా రామచంద్రారెడ్డిని టి‌డి‌పి ఇంచార్జ్ గా పెట్టారు. చల్లా అక్కడ దూకుడుగా పనిచేస్తున్నారు. ఇదే తరుణంలో అక్కడ ఊహించని విధంగా మరో నేత తెరపైకి వచ్చారు. పెద్దిరెడ్డిని ఓడిస్తానని ముందుకొచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్..పెద్దిరెడ్డిపై పోటీ చేసి ఓడిస్తానని సవాల్ విసిరారు.

అయితే ఇటీవల వైసీపీ వర్గం..రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు రామచంద్రకు మద్ధతుగా నిలిచారు. ఇక రామచంద్ర…ఇటీవల కేంద్ర హోమ్ మంత్రిని కలిసి పుంగనూరులో పరిస్తితులని వివరించారు. అలాగే ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డిపై పోటీకి చంద్రబాబు అవసరం లేదని, తానే పోటీ చేస్తానని రామచంద్ర యాదవ్ ప్రకటించారు.

అలాగే తాను లోకేష్‌ని కలవడం లేదని, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది కొన్ని రోజుల్లో చెబుతానని రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలని, ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకు వివరిస్తానని, తనకు మద్ధతిచ్చే ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటానని రామచంద్ర పేర్కొన్నారు. మొత్తానికి పెద్దిరెడ్డిపై పోటీకి సిద్ధమయ్యారు. మరి ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారో చూడాలి.