లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధం..బ్రేకులు పడతాయా!

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ నెల 27 నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పాదయాత్రకు డీజీపీని అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఇక పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ రావడంతో..టీడీపీ శ్రేణులు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు.  ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.

అయితే 25వ తేదీ ఉదయం హైదరాబాద్‌, ఎన్‌టీఆర్‌ ఘాట్‌లో లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళ్లు అర్పించనున్నారు. అదే రోజు రాత్రి తిరుమలకు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి 26వ తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. 27వ తేదీన కుప్పంలోని వరదరాజుస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.

కుప్పం నుంచి మొదలుకానున్న పాదయాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. అయితే లోకేష్ పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం బ్రేకులు వేస్తుందా? అనే అనుమానం టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఇప్పటికే జీవో1 తో రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టకూడదని రూల్ పెట్టారు. కానీ ఈ జీవోని హైకోర్టు సస్పెండ్ చేసింది. అయినా సరే వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా ముందుకెళ్లనుందని తెలుస్తోంది.

ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర సజావుగా సాగుతుందా? లేక బ్రేకులు పడతాయనేది క్లారిటీ లేదు. చూడాలి మరి లోకేష్ పాదయాత్ర ఏ విధంగా ముందుకెళుతుందో.