పవన్‌తో కలిసే బీజేపీ..సీఎం అభ్యర్ధి ఫిక్స్!

ఏపీలో ఆసక్తికరంగా మారుతున్న రాజకీయ సమీకరణాల్లో..ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పొత్తు దిశగా వెళుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు-పవన్ భేటీ బట్టి చూస్తే..పొత్తు ఖాయమని అర్ధమవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..జనసేన-బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే.

కాకపోతే పేరుకే పొత్తు గాని ఎప్పుడు కూడా ఉమ్మడిగా కార్యక్రమాలు చేసిన సందర్భాలు లేవు. ఎవరి పని వారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే పలుసార్లు పవన్..బీజేపీని రూట్ మ్యాప్ అడిగారు..కానీ బీజేపీ దీనిపై పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలో ఆ మధ్య పవన్-బాబు భేటీ కావడం..ఆ తర్వాత మోదీతో పవన్ భేటీ అవ్వడం జరిగింది. దీంతో మళ్ళీ ట్విస్ట్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా బాబు-పవన్ మరోసారి భేటీ అయ్యారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైనట్లే అని చెప్పవచ్చు.

ఇదే సమయంలో ఈ పొత్తులో బీజేపీ ఉంటుందో లేదో క్లారిటీ లేదు. పైగా చంద్రబాబుతో కలిసే ప్రసక్తి లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. అయితే బీజేపీతో కలవడానికి టీడీపీ క్యాడర్ సైతం రెడీగా లేదు. కాకపోతే సెంట్రల్ బలం కావాలి కాబట్టి బీజేపీ పొత్తులో వస్తే మంచిదే అని బాబు-పవన్ భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తుకు రెడీగా లేదు.

ఒకవేళ బీజేపీ కలిసొస్తే పర్లేదు..లేదంటే పవన్..వదిలేసి టీడీపీతో కలిసి ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా బాబు-పవన్ భేటీపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే..బీజేపీకి టీడీపీతో కలిసే ఆసక్తి లేదని తెలుస్తోంది. బాబుని కలవడం వల్ల పవన్ వీక్ అయ్యారని, ఏదేమైనా బీజేపీతో ఉంటేనే పవన్ సీఎం అవుతారని, కాపుల ఆశలు నెరవేరతాయని మాట్లాడారు. మొట్టనికి బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేలా లేదు.