బీఆర్ఎస్‌లోకి తోట..ఏపీలో కేసీఆర్ కాపు లెక్క..?

బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్..ఏపీలో పార్టీని విస్తరించాలని చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పార్టీ ఆఫీసుని విజయవాడలో పెట్టారు. ఇదే క్రమంలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం చేశారు. పార్టీలోకి పలువురు కీలక నేతలని చేర్చుకోనున్నారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్ పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు. ఇక ఈయనకే ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నారు.

గతంలో ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీలో పోటీ చేసి ఓడిపోయిన తోట..2019 ఎన్నికల్లో జనసేన తరుపున గుంటూరు వెస్ట్ లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఈయన ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈయనతో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సైతం బీఆర్ఎస్ లో చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రావెల..2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతుంది.

అయితే తోట చేరిక ఖాయమైంది..ఇక ఈయన ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ శాఖ పనిచేస్తుందని తెలుస్తోంది. కాపు వర్గానికి చెందిన తోటతో..ఏపీలో కాపు ఓటర్లు బీఆర్ఎస్ పార్టీతో కలిసొస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక కాపు ఓటర్లని గాని ఎక్కువ ఆకర్షిస్తే..టీడీపీ-జనసేన పొత్తుకు కాస్త నష్టం జరిగే ఛాన్స్ ఉంది. కానీ అంత ఈజీగా బీఆర్ఎస్ బలపడుతుందని అనుకోవడానికి లేదు.

గత ఎన్నికల్లో తోట జనసేన నుంచి పోటీ చేసిన సరే ఎక్కువ ఓట్లు తెచ్చుకోలేదు. అంటే తోటకు పర్సనల్ ఫాలోయింగ్ పెద్దగా లేదని చెప్పవచ్చు. మరి ఏపీలో బీఆర్ఎస్ ఏ విధంగా రాజకీయం చేస్తుందో చూడాలి.