ఎన్నికలు దగ్గరకొస్తే చాలు..అన్నీ పార్టీలకు బీసీ వర్గాలు గుర్తొస్తాయి. ఎందుకంటే బీసీల ఓట్లే ఎక్కువ కాబట్టి. వారు వన్ సైడ్ గా ఓట్లు వేస్తే..గెలుపు ఈజీ. అందుకే బీసీలని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు మళ్ళీ రాజకీయం చేయడం మొదలుపెట్టాయి. అయితే గత ఎన్నికల ముందు బీసీలని వైసీపీ బాగానే ఆకర్షించింది. మెజారిటీ బీసీల ఓట్లు వైసీపీకి పడ్డాయి. దీంతో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది.
ఈ సారి కూడా బీసీల ఓట్లు దక్కించుకునేందుకు వైసీపీ ఎత్తులు వేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే విజయవాడలో జయహో బీసీ సభ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా బీసీలకు తాము చాలా చేశామని, గత చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పనున్నారు. అయితే ఇక్కడ బీసీలకు జగన్ ప్రభుత్వం కూడా చేసిందేమి లేదని విమర్శలు వస్తున్నాయి. అందరితో పాటే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. పథకాలు గత ప్రభుత్వాల్లో కూడా ఉన్నాయి..కొత్తగా రెండు, మూడు పథకాలు ఇప్పుడు వస్తున్నాయి.
ఆర్ధికంగా ఇంకా బీసీలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక గత ప్రభుత్వాల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా..బీసీలకు సాయం అందేది. ఇప్పుడు ఉండటానికి కులానికో కార్పొరేషన్ అన్నట్లు 56 కార్పొరేషన్లు ఉన్నాయి. మరి వాటి ద్వారా ఎంతమంది బీసీలకు లబ్ది జరిగిందో ఎవరికి క్లారిటీ లేదు. అలాగే బీసీలకు పదవులు నామమాత్రంగానే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.
పదవులు బీసీలకు, పెత్తనం రెడ్లకు అనే విమర్శలు వస్తున్నాయి. ఇక వైసీపీకి ధీటుగా టీడీపీ సైతం బీసీలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. అసలు వైసీపీ హయాంలో బీసీలకు న్యాయం జరగలేదని, టీడీపీనే న్యాయం చేసిందని చెబుతున్నారు. వైసీపీకి ధీటుగా బీసీ సదస్సులు నిర్వహించాలని టీడీపీ చూస్తుంది. ఎవరికి వారు బీసీ ఓట్లని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో బీసీలు వైసీపీ వైపు వెళ్లారు..ఈసారి ఆ పరిస్తితి మారేలా కనిపిస్తోంది.