అనంతలో చౌదరీకి సీటు కష్టాలు..!

అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అంతా అనుకుంటారు…అయితే ఒకప్పుడు అనంతలో టీడీపీకి కలిసొచ్చింది..కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారింది..అక్కడ వైసీపీ పాగా వేసింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 సీట్లు, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే నిదానంగా అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం వలన టీడీపీకి కలిసొస్తుందని అనుకోవడానికి లేదు. వాస్తవానికి కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..కానీ దాన్ని ఉపయోగించుకుని బలపడటంలో మాత్రం టీడీపీ విఫలమవుతుంది.

అయితే జిల్లాలో ఇప్పుడు వైసీపీకే కాస్త లీడ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఓ ఐదారు సీట్లలో టీడీపీకి పాజిటివ్ కనిపిస్తోంది. ఇక టీడీపీ పలు స్థానాల్లో వెనుకబడి ఉంది. గుంతకల్లు, ధర్మవరం, మడకశిర, శింగనమల, అనంతపురం అర్బన్ లాంటి స్థానాల్లో టీడీపీ బలపడలేదు. ఇక్కడ అర్బన్ స్థానంలో టీడీపీకి బలమైన నాయకత్వం ఉంది గాని..సీటు విషయంలో క్లారిటీ లేదు. 2014లో ఇక్కడ టీడీపీ నుంచి ప్రభాకర్ చౌదరీ గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి అనంత వెంకట్రామి రెడ్డి గెలిచారు.

అయితే అనంతపై పెద్దగా వ్యతిరేకత లేదు..పైగా ఈయన ప్రజల్లోనే ఉంటున్నారు. అటు ప్రభాకర్ చౌదరీ సైతం బాగానే కష్టపడుతున్నారు..కాకపోతే అక్కడ జేసీ ఫ్యామిలీ వర్గంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభాకర్, జేసీ ఫ్యామిలీల మధ్య పోరు నడుస్తోంది. ఇదే సమయంలో ఈ సీటు పొత్తు ఉంటే జనసేనకు ఇస్తారనే టాక్ కూడా వస్తుంది. దీంతో ప్రభాకర్ చౌదరీ అంత దూకుడుగా పనిచేయట్లేదు.

దీంతో అర్బన్ సీటులో టీడీపీకి ఆశించిన మేర బలం పెరగడం లేదు. చంద్రబాబు ఫోకస్ చేసి..సీటు విషయం తేలిస్తే..కొంతమేర కన్ఫ్యూజన్ తగ్గుతుంది. చూడాలి మరి అర్బన్ సీటు ఎవరికి ఇస్తారో.