రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు.. ఇక్కడ అభివృద్ది లో వేగం కనిపించాలని, మూడు రాజధానులు ఏర్పాటు చేసుకు నే హక్కు, పార్లమెంటు చేసిన చట్టాన్ని సవరించే వెసులుబాటురాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంలో పిటిషన్ వేసిన వైసీపీ సర్కారుకు మేలు జరుగుతుందని అనుకున్నారు. ఇది సహజం కూడా.. అందుకే పదేపదే రాజధానిపై చేసిన చట్టాన్ని సవరించుకునే హక్కు రాష్ట్రానికి ఉందంటూ వాదనలు వినిపించారు.
అయితే, సుప్రీం కోర్టు మాత్రం దీనిని తోసిపుచ్చింది. అయితే.. కేవలం అమరావతి నిర్మాణం.. రైతులకు ఫ్లాట్లు వంటివాటిపై మాత్రమే ఉపశమనం కల్పించింది. దీంతో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఏదో చేయాలని అనుకున్న వైసీపీ సర్కారుకు సహజంగానే ఎదురు దెబ్బతగిలినట్టయింది. దీంతో ముందుకు వెళ్లలేక.. వెనక్కి వెళ్లలేక సతమతం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుపై మంగళవారం సీఎం జగన్ ముఖ్యులతో భేటీ అయ్యారని తెలిసింది.
ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని ఆయన కీలక సలహాదారులు.. పార్టీలో పెద్దలను సంప్రదించినట్టు తెలిసింది. వాస్తవానికి సుప్రీం కోర్టు కనుక రాజధాని విషయంలో చట్టం చేసుకునే హక్కు రాష్ట్రానికి ఉందని వ్యాఖ్యానించి ఉన్నా విశాఖకు వెంటనే తరిలిపోయేందుకు ప్రభుత్వం సిద్ధమైందని కొన్ని రోజులుగా తాడేపల్లిలో చర్చ సాగింది. అయితే, ఇప్పుడు అలాంటి సంకేతాలు ఏవీ రాకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు.
మరోవైపు.. కేసును జనవరి 31 వరకు వాయిదా వేయడంతో సుదీర్ఘ సమయం వృథా అవుతుందని అధిష్టానం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. విశాఖ వెళ్లిపోయి.. అక్కడ నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని, సంక్రాంతి తదుపరి నుంచి అక్కడే ఉండిపోవాలని తాడేపల్లి వర్గాలకు అంతర్గత సమాచారం అందింది. అయితే, ఇప్పుడు ఎటూ కాకుండా ఆదేశాలు రావడంతో తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారోచూడాలి.