మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మల్టీస్టారర్ మూవీ `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రుతి హాసన్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు.
ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన పోస్టర్లు, గ్లిమ్ప్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వీరయ్య టైటిల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను మేకర్స్ బయటకు వదిలారు.
`పూనకాలు లోడింగ్` అంటూ సాగే ఈ పాటను చిరంజీవి, రవితేజలపై చిత్రీకరించారు. ఈ మెగా మాస్ సాంగ్ లో చిరు, రవితేజ వేసే తీన్‌మార్ స్టెప్పులకు నిజంగానే పూనకాలు రావడం ఖాయం. దేవీ శ్రీ ప్రసాద్ స్వర పరిచిన ఈ పాటను రోల్ రైడా, రామ్ మిర్యాలతో కలిసి దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. కాగా, ఈ చిత్రంలో మత్స్య కారులకు నాయకుడిగా చిరు, పవర్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ కనిపించబోతున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.