పవన్ రోడ్డుపైకి వస్తే చాలు భారీగా యువత వస్తారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనం కిక్కిరిసి పోతారు. ఆయన ఒక్క పిలుపు ఇస్తే రోడ్లపైకి వచ్చేస్తారు. అంటే పవన్‌కు అంత ఫాలోయింగ్ ఉంది. అయితే ఫాలోయింగ్ ఉంది గాని..ఓట్లు మాత్రం రావట్లేదనే అసంతృప్తి పవన్‌కు ఎక్కువ ఉంది. తన వెనుక తిరిగేవారే తనకు ఓట్లు వేయట్లేదు. ఆ విషయంపై పలుమార్లు పవన్ సైతం ప్రస్తావించారు. సభలు పెడితే వేలాది మంది వస్తారని కానీ ఓట్లు మాత్రం వేయరని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
వాస్తవానికి గత ఎన్నికల్లో అదే జరిగింది..పవన్ సభలకు భారీగా జనం వచ్చారు. కానీ ఓట్లు వేసే విషయంలో జగన్ వైపు వెళ్ళినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో కూడా పవన్ అన్నని అభిమానిస్తాం..జగనన్నకు ఓటు వేస్తామని చెప్పిన బ్యాచ్ ఎక్కువగానే ఉంది. అలా చేయడం వల్ల ఆఖరికి పవన్ సైతం గెలవలేదు. అందుకే ఈ సారి పవన్ జాగ్రత్త పడుతున్నారు. తన అభిమాన ఓట్లని, కాపు ఓట్లు ఏ మాత్రం పోకుండా చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే యువత మొత్తానికి ఏకతాటిపైకి చేర్చేలా పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు. యువతను పెద్ద ఎత్తున ఆకర్షితులను చేయడానికి యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. జనవరి 12వ తేదీన తొలి సభను నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో ఈ సభ ఏర్పాటు కానుంది. యువత ఓటు బ్యాంకు కలిసొచ్చేలా పవన్ సభ ప్లాన్ చేశారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో మెజారిటీ యువత జగన్ వైపు మొగ్గు చూపారు. కానీ జగన్ ప్రభుత్వంలో యువతకు ఒరిగింది లేదు. నిరుద్యోగులని ఆదుకున్నది లేదు. దీంతో యువత కాస్త వైసీపీకి యాంటీగా ఉన్నారు. అటు యువత ఓట్లని ఆకట్టుకోవడంలో టీడీపీ సక్సెస్ కావట్లేదు. దీంతో మెజారిటీ యువతని తనవైపుకు తిప్పుకోవడానికి పవన్ ప్లాన్ చేశారు. మరి ఈ సారి యువత పవన్‌కు మద్ధతుగా ఉంటారో లేదో చూడాలి.