పార్వతీపురం టీడీపీలో సీటు పోరు..చిరంజీవులకు ఎసరు!

గిరిజన ప్రాంతాల్లో టీడీపీకి పెద్ద పట్టు లేదనే సంగతి తెలిసిందే..మొదట నుంచి ఆ ప్రాంతాల్లో ఉన్న సీట్లలో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండేది..ఆ తర్వాత వైసీపీకి పట్టు ఉంది. కాంగ్రెస్ దెబ్బతినడంతో ఆ ప్లేస్ లోకి వైసీపీకి వచ్చింది. గిరిజన ప్రజలు వైసీపీని ఆదరిస్తూ వస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్నీ స్థానాల్లో వైసీపీకి పట్టు ఉంది.

అయితే టీడీపీకి కొద్దో గొప్పో పట్టు ఉన్న స్థానం పార్వతీపురం…ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ఈ స్థానంలో 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బొబ్బిలి చిరంజీవులు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి అలజంగి జోగారావు గెలిచారు. ఈ మూడున్నర ఏళ్లలో ఆయన కూడా ఎమ్మెల్యేగా పెద్దగా పట్టు తెచ్చుకోలేకపోయారు. దీంతో ఇక్కడ వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి. టీడీపీ కాస్త గట్టిగా పనిచేస్తే పార్వతీపురంలో గెలవచ్చు.

అయితే ఇక్కడ సీటు విషయంలో కాస్త క్లారిటీ లేదు. ఇంచార్జ్ గా చిరంజీవులు ఉన్నారు..అదే సమయంలో ఈ సీటు కోసం మరో నేత ట్రై చేస్తున్నారు.  తాజాగా చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ జిల్లా నేతలని కలిశారు. అలాగే రోడ్ షోలు నిర్వహించారు. రోడ్ షోలకు మంచి స్పందన వచ్చింది. ఇదే సమయంలో కొన్ని సీట్లలో విషయంలో నేతల మధ్య ఉన్న విభేదాలని పరిష్కరించడానికి చూశారు.

ఇదే సమయంలో బలిజిపేట మండలానికి చెందిన టీడీపీ నేత వాడాడ రాము తన బయోడేటాను చంద్రబాబుకు అందించి.. పార్వతీపురం టిక్కెట్‌ ఇవ్వాలని కోరారు. దీంతో సీటు విషయంలో పోటీ వచ్చింది. అయితే బాబు మాత్రం చిరంజీవులు వైపే మొగ్గు చూపేలా ఉన్నారు. కానీ ఆయన కూడా సరిగ్గా పనిచేయకపోతే సీటుకు ఎసరు వస్తుంది.