పరిటాల వర్సెస్ కేతిరెడ్డి: ధర్మవరంలో ముదిరిన పోరు..!

ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయడానికి శ్రీరామ్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే..ఇదే క్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డిని గట్టిగా టార్గెట్ చేశారు.

ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పెద్ద బోగస్ అని, కొందరు ఆర్టిస్టులని పెట్టుకుని, కెమెరాలు, మైక్‌లు పెట్టుకుని కేతిరెడ్డి డ్రామాలు చేస్తున్నారని శ్రీరామ్ విమర్శలు చేస్తున్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలని అణిచివేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ఇక కేతిరెడ్డి భూ దోపిడి చేస్తున్నారని, అక్రమాలు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విమర్శలపై కేతిరెడ్డి కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.  పైగా ఈ మధ్య కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులు కలకలం రేపాయి. దీంతో కేతిరెడ్డి ఆ పోస్టులపై మండిపడ్డారు. తాహతుకు మించి పోస్టులు పెడుతున్నారని, పోటుగాడు అనిపించుకోవడానికి హద్దులు మీరుతున్నారని ఫైర్ అయ్యారు.

రాజకీయ ప్రత్యర్థులను తాము ఏం అనలేదని, కానీ మమ్మల్ని అంటే ఊరుకోబోమని హెచ్చరించారు. 2014లో తనని జగన్ తాడిపత్రి పంపిస్తానని అన్నారని, కానీ ధర్మవరంలో పోటీ చేసి గెలిచానని, కానీ శ్రీరామ్ రాప్తాడులో పోటీ చేసి ఓడిపోయి, ధర్మవరం వచ్చారని, అక్కడ గెలిచి వచ్చి మాట్లాడితే బాగుంటుందని కౌంటర్ ఇచ్చారు. ఇక తన గురించి గాని, తన ఫ్యామిలీ గురించి గాని ఇష్టారాజ్యంగా మాట్లాడితే తాటతీస్తానని, రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవచ్చని, కానీ ఫ్యామిలీల జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఇలా ధర్మవరంలో పరిటాల వర్సెస్ కేతిరెడ్డి అన్నట్లు రాజకీయం నడుస్తోంది.